వాషింగ్టన్: అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ అవశేషాలను సందర్శించడానికి వెళ్లిన టైటాన్ సబ్ మెర్సిబుల్ వాహనం విస్ఫోటం చెందడంతో అందులో ప్రయాణిస్తోన్న అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే జలాంతర్గామి శకలాలను కూడా వెలికితీశారు. ఈ సందర్బంగా మృతులలో ఒకరైన పాకిస్తాన్ వ్యాపారవేత్త షాహ్జాదా దావూద్ భార్య భర్త, కుమారుడు చివరి రోజుల అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
పాకిస్తాన్ కు చెందిన బిలియనీర్ షాహ్జాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్ ఈ నాలుగు గంటల సాహస యాత్రకు ముందు మానసికంగా చాలా సిద్ధపడ్డారని తెలిపారు షాహ్జాదా భార్య క్రిస్టీన్ దావూద్. మా అబ్బాయి అయితే టైటానిక్ చూడటానికి వెళ్తున్నానని తెలియగానే చాలా సంబరపడ్డాడు. వాస్తవానికి నేను కూడా వారితో వెళ్లాల్సి ఉండగా అనుకోని పరిస్థితుల్లో ఈ ట్రిప్ వాయిదా పడటంతో నాకు బదులుగా మా అబ్బాయి అందులో ప్రయాణించాడు.
ఈ ట్రిప్ జరిగిన రోజున కూడా ఫ్లైట్ ఆలస్యం కావడంతో పోలార్ ప్రిన్స్ (టైటాన్ జలాంతర్గామి మొదలైన చోటు) చేరుకోవడానికి ఆలస్యమైంది. ఆరోజు ఫ్లైట్ మరింత ఆలస్యమైనా బాగుండేది. ఓషన్ గేట్ సంస్థ వారు దీని వలన ఏ ప్రమాదం ఉండడదని చెబుతూ రావడంతో మాకు దాని పనితీరుపై కొంచెమైనా అనుమానం కలగలేదు. కానీ అందులో ప్రయాణం ఇంజిన్ సరిగా పనిచేయని ఫ్లైట్లో ఎగరడమేనని ఆరోజు గ్రహించలేకపోయాము.
షాహ్జాదా , సులేమాన్ ఇద్దరూ చివరి రోజుల్లో బంక్ బెడ్ ల మీద పడుకోవడం, బఫెట్ తరహా భోజనాలు అలవాటు చేసుకోవడం, తరచుగా టైటానిక్ సినిమాను చూసేవారని చెప్పుకొచ్చారు. జలాంతర్గామి నీటిలోపలికి వెళ్ళగానే అందులోని లైట్లన్నిటిని ఆర్పేస్తారని మీకు నచ్చిన మ్యూజిక్ వింటూ చిన్న వెలుతురులో చుట్టూ ఉన్న చేపలను మాత్రం చూడవచ్చని ఓషన్ గెట్ సంస్థ చెప్పినట్లు తెలిపారు క్రిస్టీన్.
ఏదైతేనేం సరైన ప్రమాణాలు పాటించని ఈ ట్రిప్ నిర్వాహకుల అజాగ్రత్త, ప్రయాణికుల అవగాహనలేమి కలగలిసి విహారయాత్ర కాస్తా విషాద యాత్రగా ముగిసింది.
ఇది కూడా చదవండి: రగులుతోన్న ఫ్రాన్స్.. దొంగలకు దొరికిందే ఛాన్స్..
Comments
Please login to add a commentAdd a comment