లైవ్‌లో పిడుగు.. నడిరోడ్డుపై నిప్పుల వాన
బీజింగ్: లైవ్‌లో ఎప్పుడైనా పిడుగును చూశారా? దాని తీవ్రత ఎలా ఉంటుందో.. అది పడ్డాక ఎలాంటి వస్తువైనా ఎలా కాలిపోతుందో ఎప్పుడైనా గమనించారా? కానీ, చైనాలోని షెన్యాంగ్ ప్రాంత ప్రజలకు ఆ అవకాశం దక్కింది. అది కూడా రోడ్ల మీద రయ్‌మంటూ దూసుకెళ్లే వాహన చోదకులకు. అవును ఈ నెల(మే) 11న చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోగల షెన్యాంగ్‌లో పెద్ద మొత్తంలో గాలిదుమ్ము వచ్చింది. ఆ సమయంలో వర్షంపడటంతోపాటు పెద్ద పెద్ద ఉరుములు శబ్ధం కూడా వినిపిస్తోంది.
సరిగ్గా అదే సమయంలో షెన్యాంగ్‌లోని రద్దీగా ఉండే ఓ కాలనీలో కారు వాహనదారులు తమ కార్ల వైఫర్లు ఆన్ చేసుకొని దూసుకెళుతుండగా నడి రోడ్డుపై భారీ పిడుగు పడింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న చెట్లు మాడిపోయి వాటి ఆకులన్నీ కూడా నిప్పుల వర్షంలాగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వారంతా కూడా తమ వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసి గజగజ వణికిపోయారు. తొలుత ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్మినట్లు అని ఆ వెంటనే భారీ వెళుతురుతో నిప్పుల వర్షాన్ని కురిపించింది ఆ పిడుగు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఓ కారులోని కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.