
25 లక్షల మంది చూసిన కౌగిలింత
లూసియానా: ఎంతో ప్రేమగా పెంచుకునే కుక్క చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఓ బాలుడు. తనకు శునకాల మీద ఉన్న ప్రేమని తల్లిదండ్రులకు కూడా చెప్పలేక పోయాడు. తన మనసులోనే కుక్కలపై అభిమానాన్ని పెంచుకున్నాడు. ఎవరూలేని ఇంట్లో అతడు కుక్కకు ఇచ్చిన ఓ హగ్ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరా కంటికి చిక్కింది. ఇంకేముంది కల్మశంలేని ఆ చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు లూసియానాకు చెందిన జోష్ బ్రూక్స్ అనే బాలుడు.
వీడియోలో ఏముందంటే.. ఎవరూలేని ఓ ఇంట్లోకి జోష్ వేగంగా వచ్చి సైకిల్‌ను కిందపడేస్తాడు. వెంటనే పరుగున అక్కడే ఉన్న ఓ కుక్క దగ్గరికి వేగంగా వచ్చి ప్రేమతో కౌగిలించుకుంటాడు. ఆ మరుక్షణమే తిరిగి అక్కడి నుంచి వేగంగా వెళ్లి సైకిల్ తీసుకొని వెళ్లిపోతాడు.
ఈ తతంగాన్ని కుక్క(డచెస్) యజమాని హోలీ బ్రూక్స్ మాల్లెట్ తన ఇంట్లో అమర్చిన సెక్యురిటీ కెమెరాలో చూసి ఆ బాలున్ని కలవాలనుకుంది. దీంతో వెంటనే ఆ వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ బాలున్ని నిర్భయంగా వచ్చి తన కుక్కతో ఆడుకోవొచ్చని తన పోస్ట్‌లో పేర్కొంది.
కుక్కలంటే తన కుమారుడికి అమితమైన ఇష్టమని వీడియోను చూసిన బాలుడి తల్లి జింజర్ క్లెమెంట్ బ్రూక్స్ ఫేస్‌బుక్‌లోనే రిప్లే ఇచ్చింది. అనుమతిలేకుండానే జోష్ మరొకరి ఇంట్లో ఉండలేడని తెలిపింది. ఎప్పుడూ ఆ కుక్క గురించి తన దగ్గర చెబుతాడని పేర్కొంది. జోష్ రెండేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే మా ఇంట్లో బెల్లా అనే కుక్క ఉండేది. కానీ, గత ఏడాదే అది మరణించింది. ఆ తర్వాత జోష్ స్కూల్ పనుల్లో బిజీగా ఉండటంతో మరో కుక్క పిల్లను తీసుకోవాలన్న ఆలోచన రాలేదని తెలిపింది.
ఇప్పుడు కుక్క పిల్ల తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని జోష్ తల్లి తెలిపింది. హోలీ బ్రూక్స్ తమ కుక్కుతో గడిపే అవకాశం ఇవ్వడంతో బాలుడు ఇప్పుడు సమయం దొరికినప్పుడల్లా వెళ్లి ఆ కుక్కతో ఆడుకుంటున్నాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మంది వీక్షించారు. ఇదొక పాజిటివ్ కథ. ఈ వీడియోను గమనించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కుక్క యజమాని హోలీ బ్రూక్స్ తెలిపింది. స్వచ్ఛమైన మనస్సున్న బాలున్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని మురిసిపోతోంది. చిన్న పిల్లల ఆలోచనలను ప్రతిబింబించే ఈ వీడియో వారి సున్నితమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుందని వీడియో వీక్షించిన వారందరూ అంటున్నారు.