న్యూయార్క్: అమెరికా, లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఢీకొన్నాయి. వాహనాలు ఒకదానికొకటి చొచ్చుకొచ్చి మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఇంటర్‌స్టేట్-55 రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పాంట్ చార్ట్రెయిన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు కుప్పలుగా పడి ఉన్నాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక విషయాలను ప్రత్యక్ష సాక్షులు ఈ విధంగా వివరించారు. రహదారి అంతా పొగమంచుతో అస్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. క్షతగాత్రుల రోదనలతో భయానక వాతావరణం ఏర్పడింది. ఓ కారు ఏకంగా వంతెన దాటి నీటిలో పడిపోయింది. డ్రైవర్లు రోడ్లుపైకి వచ్చి సహాయం కోరుతున్నారు. 7గురు చనిపోగా.. దాదాపు 30 మంది గాయపడ్డారు. దాదాపు 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేసిన అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా అధికారులతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. రహదారిని మూసేసే అంశంపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు.. ఖండించిన క్రెమ్లిన్
Comments
Please login to add a commentAdd a comment