బ్లడ్ మూన్ (ప్రతీకాత్మక చిత్రం)
ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం (వివిధ దశలు దాటే ప్రక్రియ మొత్తం ఆరుగంటలకు పైగానే) మరో రెండురోజుల్లోనే వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం మనదేశంలో ఈ సంపూర్ణ చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి (27న) 10.44 నిముషాలకు మొదలై శనివారం (28న) తెల్లవారుజామున 4.58 నిముషాలకు ముగియనుంది. శుక్రవారం అర్ధరాత్రి శనివారం (27,28 తేదీల మధ‍్యలో) మొత్తం 103 నిముషాలు అంటే తెల్లవారు జామున ఒంటిగంట 2 గంటల 43 నిముషాల మధ్యలో చంద్రగ్రహణం ఉచ్ఛదశకు చేరిన సందర్భంగా ముదురు ఎరుపులో కనిపిస్తుంది. దీనిని ’బ్లడ్ మూన్’గా అభివర్ణిస్తున్నారు.
ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికాల్లోని ప్రజలకు ఇది కనువిందు చేయనుంది. ఉత్తర అమెరికా (యూఎస్‌ఏ)ప్రజలకు (వారికి శుక్రవారం పగలు అయినందున) ఇది కనిపించే అవకాశాలు లేవు. ఆయా దేశాల కాలమానాలను బట్టి చందమామ ఎంత స్పష్టంగా కనపడుతుందనేది ఆధారపడి ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తూర్పు ఆసియా దేశాల్లో కొంత ఆలస్యంగా శనివారం తెల్లవారుజామున, మిగతా చోట్ల శుక్రవారం రాత్రి గ్రహణంలో జాబిల్లి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మిగతా ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అంటార్కిటికా అంతటా యావత్ గ్రహణదశలు వీక్షించవచ్చునని తెలుస్తోంది. సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తీసుకునే జాగ్రత్తలకు భిన్నంగా దీనిని వీక్షించేందుకు ఎలాంటి ప్రత్యేక పరికరాలు, అద్దాలు అవసరం లేదు. అయితే ఆకాశం మేఘావృతం కాకుండా ఉంటేనే వీక్షికులకు ఈ గ్రహణం స్పష్టంగా కనిపించే అవకాశాలున్నాయి. అదేరోజు రాత్రి అంగారక గ్రహం (మార్స్) కూడా చందమామకు అత్యంత చేరువగా కనిపించనుంది. ఈ గ్రహం కూడా మామూలుగానే మనుషులకు కనిపించే అవకాశాలున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
జాబిల్లి, సూర్యుడు మధ్యలో సమాంతర కక్ష‍్యలోకి భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. భూమి నీడలో చందమామ మునిగిపోయినపుడు ఇది సాధ‍్యమవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణంలో సూర్యుడి ప్రత్యక్ష కిరణాలను భూమి అంచుల నుండి చంద్రుడిపై పడతాయి. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈ మొత్తం చంద్రగ్రహణ దశనే బ్లడ్‌మూన్‌గా పిలుస్తున్నారు. మళ్లీ ఇలాంటి సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోవాలంటే మరో 105 ఏళ్లు అంటే 2123 జూన్ 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే మరి..!
- సాక్షి, నాలెడ్జ్ సెంటర్
చదవండి:
శుక్రవారం భూమి అంతం..!!
Comments
Please login to add a commentAdd a comment