వాషింగ్టన్ : 21వ శతాబ్దంలోనే దీర్ఘకాల చంద్రగ్రహణం ఈ నెల 27(శుక్రవారం) సంభవించనుంది. ఈ సమయంలో చంద్రుడు ఎరుపెక్కనున్నాడు(బ్లడ్ మూన్). సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరసలోకి రావడం వల్ల ఇది జరుగుతుంది. సూర్యుడి కిరణాలు భూమిపై ప్రసరించి అతికొద్ది మొత్తంలో చంద్రుడిని చేరడంతో చందమామ ఎరుపు రంగులోకి మారతాడు. ఇదే సమయంలో అంగారక గ్రహం మన కంట పడనుంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో అత్యంత ప్రకాశవంతంగా అంగారక గ్రహం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ శతాబ్దపు ఖగోళ వింతను తిలకిద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, మరికొందరు మాత్రం శుక్రవారమే మానవుని మనుగడకు ఆఖరి రోజని హడలెత్తిపోతున్నారు. బ్లడ్‌మూన్‌తో పాటుగా అంగారక గ్రహం కనిపిస్తే విపత్కర పరిస్థితులు సంభవిస్తాయని పూర్వీకులు విశ్వసించేవారు. అయితే, అది నిజమేనని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు. శుక్రవారం ప్రళయం సంభవించడం ఖాయమని వారు అంటున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు.
2003లో చివరిసారిగా అంగారక గ్రహం ఆకాశంలో కనిపించిందని, అప్పుడేం జరగనిది ఇప్పుడు జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు. 2003లో మార్స్ గ్రహం కనిపించినప్పుడు భూమికి, అంగారకుడికి మధ్య దూరం 56 మిలియన్ కిలోమీటర్లని చెప్పారు. శుక్రవారం గతంలో కంటే అత్యంత ప్రకాశవంతంగా మార్స్ ప్లానెట్ కనిపించనుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment