ఫైల్ ఫోటో
బెర్లిన్ : జర్మన్ కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత అవసరాలకు మించి తమ వద్ద 22 వేల అదనపు ఉద్యోగాలున్నాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుమారు 22 వేల మందిని తొలగించే అవకాశం ఉందని బుధవారం వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర నష్టాలనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నామని, దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పడం లేదని పేర్కొంది.
కార్మిక సంఘాలతో సమావేశం తరువాత లుఫ్తాన్సా ప్రతినిధి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇంతకుముందు అంచనా వేసిన 10,000 కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ అని తెలిపారు. జూన్ 25 న అసాధారణ సర్వసభ్య సమావేశానికి ముందే సిబ్బందితో పార్ట్‌టైమ్ పని చేయించుకోవడం లాంటి అంశాలపై కార్మిక సంఘాలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని వివరించారు.
మరోవైపు ఉద్యోగుల బలవంతపు తొలగింపులను విరమించుకోవాలని ఫ్లైట్ అటెండెంట్స్ యూనియన్ (యుఎఫ్ఓ) డిమాండ్ చేసింది. ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. అటు పైలట్ల యూనియన్ సభ్యులు కూడా 45 శాతం వరకు వేతన తగ్గింపునకు ప్రతిపాదించారు. తద్వారా 350 మిలియన్ యూరోలు కంపెనీకి ఆదా అవుతుందని ప్రతిఫలంగా కంపెనీ వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలను కాపాడాలని యూనియన్ కోరుతోంది.
కాగా 9 బిలియన్ యూరోల (10.26 బిలియన్ డాలర్ల) బెయిల్ అవుట్ ప్యాకేజీ తిరిగి చెల్లింపుతోపాటు, కోవిడ్-19 సంక్షోభంతో వేలాది ఉద్యోగాల కోత, ఆస్తి అమ్మకాలు వంటి భారీ పునర్నిర్మాణ వ్యూహాన్ని లుప్తాన్సా అమలు చేస్తోంది. రానున్న ఏజీఎంలో బెయిల్ అవుట్ ప్యాకేజీ చెల్లింపుపై వాటాదారులు ఓటు వేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment