ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్ ఎక్కువుండాలని..
ఆంట్యానెన్యారివొ: 17 ఏళ్ల యువతి జెన్నీ(పేరు మార్చాం)కి ఫేస్బుక్లో ఎక్కువ మంది మిత్రులుండాలని కోరిక. ఆమె ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వారి సంఖ్య 310. ఎలాగైనా ఇంకా ఎక్కువ మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండాలని భావించి.. అపరిచిత వ్యక్తి నుంచి వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేసింది. అంతే కిడ్నాప్కు గురై రెండు నెలలపాటు లైంగికదాడిని ఎదుర్కొంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆఫ్రికాలోని మడగాస్కర్కు చెందిన జెన్నీ ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తి చేతిలో కిడ్నాప్కు గురైంది. ఫేస్బుక్లో ఆరునెలల పాటు చాటింగ్ చేసిన 28 ఏళ్ల వ్యక్తి కలుద్దామని చెప్తే నమ్మి వెళ్లి.. అతని ఇంట్లో బందీగా మారింది. రెండు నెలల పాటు తీవ్రమైన లైంగిక దాడిని ఎదుర్కొంది. బందించిన అనంతరం రెండు వారాల పాటు స్పృహలోనే లేకుండా ఆమెకు డ్రగ్స్ ఎక్కించాడు నిందితుడు. తరువాత సైతం తప్పించుకోవాలని చూసిన ప్రతీసారీ మత్తుపదార్థాలను ఆమెపై ప్రయోగించి అణచివేశాడు.
నిందితుడి పొరుగింటి వారు జెన్నీని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో అతడి బండారం బయటపడింది. పోలీసులు నిందితుడిపై కిడ్నాప్, అత్యాచారం కేసులను నమోదు చేశారు. ప్రస్తుతం జెన్నీ కోలుకుంటున్నా.. మితిమీరిన డ్రగ్స్ ప్రయోగించడం వల్ల ఆమె జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎక్కువ మంది ఉండాలన్న తన కోరికే తన ఈ స్థితికి కారణమని జెన్నీ పోలీసుల వద్ద వాపోయింది.