మలాల 'హాయ్' అనే పోస్టుకు అనూహ్యస్పందన
'హాయ్ ట్విట్టర్'.. కేవలం రెండు పదాల సింపుల్ పోస్టు. ఈ పోస్టుకు మైక్రోబ్లాగింగ్ సైట్‌లో అనూహ్య స్పందన వచ్చింది. రోజంతా ఈ హాయ్ ట్విట్టర్ అనే పదానికి ప్రతిస్పందనలు, ఫాలోవర్స్ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ సింపుల్ పోస్టు ఎవరు చేశారో తెలుసా? నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసఫ్‌జాయ్. నిన్ననే(శుక్రవారం) ఆమె ట్విట్టర్‌లో జాయిన్ అయ్యారు. ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన మలాల, హాయ్ ట్విట్టర్ అని చెప్పి, బాలికల విద్యావ్యాప్తిగా మద్దతివ్వాలని కోరుతూ కొన్ని మెసేజ్‌లు చేశారు. ఆమె పిలుపుకు దాదాపు అంతర్జాతీయ అగ్రనేతలందరూ స్పందించారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ డ్రూడ్ నుంచి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరెస్ వరకు అందరూ మాలాలకు ట్విట్టర్‌లో ఘనస్వాగతం పలికారు.
ట్విట్టర్ సైతం ఆమెకు అధికారికంగా స్వాగతం చెప్పింది. బాలికల విద్యకు ఆమె ప్రత్యేకమైన అంకితభావాన్ని, స్ఫూర్తిని అందిస్తుందని, మాలాలకు ట్విట్టర్‌లో వెల్‌కమ్ చెబుతూ ఆంటోనియా ట్వీట్ చేశారు. జస్టిన్ ట్రూడో కూడా మాలాల హైస్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్నందుకు శుభాకాంక్షలు చెప్పారు. విద్యకోసం తను చూపిస్తున్న తెగువ, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. మలాల తనకు నిరంతరం స్ఫూర్తినందిస్తుందని బిల్‌గేట్స్ కూడా ట్వీట్ చేశారు. ఆమె అకౌంట్ క్రియేట్ చేసుకున్న 14 గంటల్లోనే 3,50,000 మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. 2012లో తాలిబన్‌ల చేతిలో దాడికి గురైన మలాల ప్రస్తుతం బాలికల విద్య కోసం పోరాటం సాగిస్తున్నారు. అతిచిన్నవయసులోనే ఆమె నోబెల్ శాంతి పురస్కారాన్ని కూడా పొందారు.