మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్
మాలే: హిందూ మహా సముద్రంలోని ద్వీప దేశం మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ను అరెస్ట్ చేసేలా లేదా అభిశంసించేలా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను పాటించకూడదంటూ పోలీసులు, భద్రతా దళాలను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ‘అధ్యక్షుణ్ని అరెస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇస్తే అది అక్రమం. మాల్దీవుల రాజ్యాంగానికి విరుద్ధం. కాబట్టి అలాంటి ఉత్తర్వును అమలు చేయకూడదని నేను పోలీసులకు, ఆర్మీకి చెప్పాను’ అని అటార్నీ జనరల్ మహమ్మద్ అనిల్ ఆదివారం మీడియాకు చెప్పారు. గతంలో యమీన్ 9 మంది అసమ్మతి నేతలను జైలులో పెట్టించారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వెళ్లిన మరో 12 మందిపై అనర్హత వేటు వేశారు.
గత గురువారం సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జైలులోని 9 మందిని విడుదల చేయాలని ఆదేశించడంతోపాటు 12 మంది సభ్యులపై అనర్హతను ఎత్తివేసింది. దీంతో 85 మంది సభ్యులున్న మాల్దీవుల పార్లమెంటు పీపుల్స్ మజ్లిస్‌లో ప్రతిపక్ష మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (ఎండీపీ)కి ఆధిక్యం లభించింనట్లైంది. సోమవారం జరగాల్సిన పార్లమెంటు సమావేశాల్లో అధ్యక్షుడు యమీన్‌ను అభిశంసించాలని ఎండీపీ భావించగా, అలా జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేసింది. కాగా, దేశాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే అవకాశాన్ని ప్రజలకే ఇచ్చేలా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు యమీన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment