పడగ నీడన ప్రజాస్వామ్యం
పడగ నీడన ప్రజాస్వామ్యం
Published Fri, Oct 4 2013 12:49 AM | Last Updated on Mon, Sep 17 2018 4:55 PM
రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీం కోర్టు ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేసింది. ఏది ఏమైనా మాల్దీవుల ప్రజాస్వామ్యానికి సైన్యం నుంచి ముప్పు తప్పేట్టు లేదు. రాజకీయాలు నేడు సంక్షోభానికి పర్యాయపదంగా మారుతున్నాయి. మన లక్షద్వీపాలకు అంటుకున్నట్టుండే దాదాపు రెండు వేల పగడపు దిబ్బల దేశం మాల్దీవులలో అత్యున్నత న్యాయస్థానమే రాజకీయ సంక్షోభానికి తెరదీసింది. సెప్టెంబర్ 28నƒ జరగాల్సిన రెండో రౌండు అధ్యక్ష ఎన్నికలను అది నిరవధికంగా వాయిదా వేసింది. సెప్టెంబర్ 7న జరిగిన అధ్యక్ష ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమం గా జరగలేదంటూ మూడో స్థానంలో నిలిచిన గాసీం ఇబ్రహీం (24 శాతం ఓట్లు) కోర్టు తలుపులు తట్టారు. వెంటనే కోర్టు, రాజ్యాం గాన్ని సైతం ధిక్కరించి ఎన్నికలను నిలిపి వేసింది.
ఐక్యరాజ్య సమితి, కామన్‌వెల్‌త, తది తర స్వతంత్ర విదేశీ పర్యవేక్షకులు, పరిశీల కులు అందరూ ఎన్నికలు పూర్తి స్వేచ్ఛగా, సక్రమంగా జరిగాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. కోర్టు మాత్రం ‘నషీద్ తప్ప ఎవరైనా’ అనే వాదనను మాత్రమే పట్టించుకుం ది! మొదటి దఫా ఎన్నికల తదుపరి 21 రోజుల్లోగా రెండో రౌండు ఎన్నికలు జరగాల న్న రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కిం ది. కాగా ‘త్వరలోనే’ సుప్రీం కోర్టు నిర్ణయం వెలువడుతుందని ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. మాల్దీవుల పరిణామా లు దక్షిణ ఆసియాలో ప్రజాస్వామ్యంపై క మ్ముకుంటున్న సైనికీకరణ నీలినీడల్లో భాగం. 1965లో బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందినప్పటి నుంచి 2008 వరకు మాల్దీవులలో అబ్దుల్ గయూమ్ నిరంకుశ నియంతృత్వమే రాజ్యం చేసింది.
సైనిక, పోలీసు, అధికార యంత్రాంగాలతోపాటూ, న్యాయవ్యవస్థ కూడా గయూమ్ చేతి కీలుబొమ్మగా మారింది. ఆ కాలపు సుప్రీం న్యాయమూర్తులకు సహజంగానే తొలి ప్రజాస్వామిక ప్రభుత్వ అధ్యక్షుడు, మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ నేత నషీద్ అంటే కంటగింపు. అధ్యక్ష ఎన్నికల్లో నషీద్ 45.5 శాతం ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచినా 50 శాతం గీతను దాటలేకపోయారు. దీంతో రెండో రౌండు తప్పనిసరైంది. ప్రోగ్రెసివ్ పీపుల్‌స పార్టీ నేత అబ్దుల్లా యమీన్ (24.5 శాతం ఓట్లు) ద్వితీయ స్థానం లో నిలిచారు. వారిద్దరి మధ్య ముఖాముఖి పోటీ జరగాల్సింది. ‘నషీద్ తప్ప ఎవరైనా’ అనేది తొలి దఫా ఓడిన ముగ్గురు అభ్యర్థుల మాట. ఎన్నికలను నిరవధిక వాయిదా వేయడమే రెండో రౌండులో నషీద్ గెలిచే పరిస్థితి ఉన్నదనడానికి నిదర్శనమనే వాదన కాదనలేనిది.
కోర్టును ఆశ్రయించిన ఇబ్రహీం తొలి దఫా ఓటమికి గురైన తమ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేయాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. నషీద్ యూదుల తొత్తని, ఇస్లాం వ్యతిరేకి అని ఆరోపించే ఇబ్రహీం మాట విని ఎన్నికలను నిలిపివేసిన న్యాయస్థానం... నేటి అధ్యక్షుడు వహీద్‌ను ఎంపిక చేసినా ఆ ముగ్గురికి అభ్యంతరం లేదు. వహీద్ సైన్యం చేతి కీలుబొమ్మ కావడం సంగతి అటుంచి ఆయనకు ఎన్నికల్లో లభించిన ఓట్లు 5 శాతం! 2008 వరకు విదేశాల్లో ప్రవాస జీవితం గడిపిన నషీద్ ఒక పాత్రికేయుడు. అధికారంలో ఉన్న కొద్ది కాలంలోనే ఉచిత వైద్యం, వృద్ధాప్య పెన్షన్లు, ఉచిత గృహవసతి వంటి సంక్షేమ పథకాలను అమలు చేశారు. 50,000 చ.కి.మీ సముద్ర ప్రాంతంలో విస్తరించి ఉన్న దేశంలో రవాణా సౌకర్యాలను అభివృద్ధి పరచారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు హామీని, పౌరులకు భద్రతను కల్పించగలిగారు.
అయితే గయూమ్ మద్దుతుదార్లను, మత ఛాందసవాద వర్గాలను ఆకట్టుకోలేకపోయారు. 2012 లో సైన్యం ప్రేరేపణపై నాడు ఉపాధ్యక్షునిగా ఉన్న వహీద్, అధ్యక్షుడు నషీద్ చేత ‘రాజీ నామా’ చేయించారు. నాటి నుంచి నేటి వరకు మన విదేశాంగశాఖ మాల్దీవుల సమస్యపై పిల్లిమొగ్గలు వేస్తోంది. ఒకప్పుడు గయూమ్ నియంతృత్వా న్ని అది గుడ్డిగా సమర్థించింది. ఆ తరువాత నషీద్‌తో సత్సంబంధాలు నెరపింది. కుట్ర కాని కుట్రలో నషీద్ పదవీచ్యుతుడైతే ఆక్షేపణ తెలపకపోగా, క్షణమైనా ఆలస్యం చేయకుం డా వహీద్ ప్రభుత్వాన్ని ‘గుర్తించింది.’ చైనా ఎక్కడ పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకుంటుందోనన్న భయం మన విధానాన్ని శాసించింది. అందుకు తగిన శాస్తి అన్నట్టుగా వహీద్ భారత్‌కు చెందిన జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్టును రద్దు చేశారు, చైనాకు చేరువయ్యారు.
ఖంగుతిన్న విదేశాంగ శాఖ తిరిగి నషీద్‌ను చేరదీసింది. తాజా పరిణామాల్లో సైతం దానిది అదే ధోరణి. కోర్టు తీర్పు తదుపరి మాల్దీవుల్లోని మన దౌత్య కార్యాలయం ఆ దేశ ఎన్నికల కమిషనర్‌తో సమాలోచనలు జరిపింది. ఆ తదుపరి ఎన్నికల కమిషన్ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అనుకున్నట్టు సెప్టెంబర్ 28న ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఘర్షణకు దిగింది. దీంతో ఎన్నికలు నిర్వహించ యత్నిం చే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు భద్రతా బలాగలను ఆదేశించింది. దీంతో మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నదన్న విమర్శలను భారత్ ఎదుర్కోక తప్పలేదు. సుప్రీం కోర్టు ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించినా... ఏదో అద్భుతం జరిగేతే తప్ప నషీద్ ఎన్నిక అసాధ్యమే అనుకోవాలి. ఏది ఏమైనా మాల్దీవుల ప్రజాస్వామ్యం సైన్యం పడగ నీడ కింద నిలవక తప్పేట్టు లేదు.
- పి. గౌతమ్
Advertisement