మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం | Maldives court throws out case against Mohamed Nasheed | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం

Published Sat, Feb 3 2018 2:05 AM | Last Updated on Mon, Sep 17 2018 5:17 PM

Maldives court throws out case against Mohamed Nasheed - Sakshi

మాలెలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు

మాలే: మాల్దీవుల్లో మరోసారి రాజకీయ అనిశ్చితి తలెత్తింది. జైళ్లలో ఉన్న ప్రతిపక్ష నేతల శిక్షల్ని రద్దు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జైలు శిక్ష ఎదుర్కొంటోన్న మాజీ అధ్యక్షుడు నషీద్‌ ప్రవాసంలో ఉండగా.. జైళ్లలో ఉన్న మిగిలిన రాజకీయ నేతల్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అధ్యక్షుడు వెంటనే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ నషీద్‌ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళనలు చేపట్టడంతో రాజధాని మాలిలో ఉద్రిక్తత నెలకొంది.

తీర్పు చెల్లుబాటవుతుందో? లేదో? పరిశీలిస్తున్నామని మాల్దీవుల సర్కారు పేర్కొంది.  కాగా, ‘మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారం చేజిక్కించుకుంటాం’ అని కొలంబోలో ఉన్న నషీ ద్‌ అన్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్‌ తెలిపింది. యమీన్‌ నిరంకుశ పాలనతో పర్యాటక ప్రాంతమై న∙మాల్దీవుల ప్రతిష్ట దెబ్బతింది. అధికారంలోకొచ్చాక స్వపక్షంలోని అసంతృప్త నేతలు, ప్రతిపక్ష నేతలను యమీన్‌ జైల్లో పెట్టించారు. ప్రవాసంలో ఉన్న నషీద్‌ ఉగ్రవాదం ఆరోపణలపై జైలు శిక్ష ఎదుర్కొంటున్నారు.  

12 మంది ఎంపీలపై అనర్హత ఎత్తివేత
గురువారం కోర్టు తీర్పును వెలువరిస్తూ.. ‘రాజకీయ ఉద్దేశాలతో నషీద్, మరో ఎనిమిది మందిపై నేర విచారణ కొనసాగించారు. ఇది దేశ రాజ్యాంగంతో పాటు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘించడమే’ అని స్పష్టం చేసింది. 12 మంది పార్లమెంటు సభ్యులపై అనర్హతను కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో 85 మంది సభ్యుల మాల్దీవుల పార్లమెంటులో యమీన్‌ వ్యతిరేక వర్గం ఆధిక్యత పెరిగింది. ‘కోర్టు ఉత్తర్వుల్ని పాటిస్తాం’ అని మాల్దీవుల పోలీసు విభాగం ట్వీటర్‌లో స్పందించడంతో ఆగ్రహించిన ప్రభుత్వం.. పోలీసు చీఫ్‌ అహ్మద్‌ అరీఫ్‌ను తొలగించింది. నషీద్‌కు చెందిన మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు.   

ప్రతిపక్ష నేతల్ని జైల్లో పెట్టించిన యమీన్‌
అధ్యక్ష పదవి నుంచి యమీన్‌ను తొలగించాలని, అతని అవినీతిపై దర్యాప్తు జరిపించాలని కోరతూ ప్రతిపక్ష నేతలు ఈ వారం మొదట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యమీన్‌తో పాటు, అతని కుటుంబ సభ్యులు, రాజకీయ అనుచరులు ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టారని ఆరోపించారు. పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో యమీన్‌ సవతి సోదరుడితో పాటు మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ తదితరులు ఉన్నారు. వివాదాస్పదమైన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నషీద్‌పై విజయం సాధించాక యమీన్‌ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్ష నేతల్ని, అధికార పక్షంలోని వ్యతిరేకుల్ని జైలులో పెట్టించగా.. మరికొందరు విదేశాల్లో తలదాచుకుంటున్నారు.

స్కూల్‌లోనే కొట్టిచంపారు!
న్యూఢిల్లీ: గతేడాది గురుగ్రామ్‌లోని ర్యాన్‌ పాఠశాలలో ప్రద్యుమ్న ఠాకూర్‌ హత్యోదంతం మర్చిపోకముందే ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని జీవన్‌జ్యోతి సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న తుషార్‌ కుమార్‌(16)పై నలుగురు తోటి విద్యార్థులు దాడిచేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పోలీసులు, ముగ్గురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు.

పాఠశాల వాష్‌రూమ్‌ దగ్గర గురువారం సాయంత్రం తుషార్‌కు, నలుగురు తోటి విద్యార్థులకు గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. వారందరూ తుషార్‌పై పిడి గుద్దులు కురిపించడంతో స్పృహ కోల్పోయాడు. కొద్దిసేపటికి అటుగా వచ్చిన కొందరు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తుషార్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. తొమ్మిదో తరగతిలోని రెండు గ్రూపుల మధ్య గొడవలో జోక్యం చేసుకోవడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement