
అట్లాంటా: ‘దేవుడు ఎప్పుడు.. ఎవరి జీవితాన్ని ఏవిధంగా మలుపు తిప్పుతాడో తెలియదు.. కెవిన్ ఎస్క్చ్ రూపంలో వచ్చి నా కలను నెరవేర్చాడు’ అంటున్నారు అమెరికాకు చెందిన ఉబెర్ డ్రైవర్ లాటోన్యా యంగ్. 16వ ఏటనే బిడ్డకు జన్మనిచ్చిన ఆమె కుటుంబాన్ని పోషించడం కోసం పగలూ రాత్రీ తేడా లేకుండా కష్టపడేవారు. పొద్దంతా హెయిర్‌స్టైలిస్ట్‌గా.. రాత్రి వేళల్లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ తన పిల్లలకు కావాల్సినవన్నీ సమకూర్చేవారు. సింగిల్ పేరెంట్ అయినప్పటికీ పిల్లలకు ఏ లోటూ రాకుండా ఉండేందుకు తన కలల్ని సైతం ఫణంగా పెట్టారు. ఫీజు కట్టే స్థోమత లేక లాయర్ కావాలనే కోరికను పక్కన పెట్టేశారు.
అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఓ ప్రయాణికుడి రూపంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనే లాటోన్యా ఆశయం నెరవేరింది. ఒకానొక రోజు తన కారులో ఎక్కిన ఎస్క్చ్ అనే వ్యక్తికి బోర్ కొట్టకుండా ఉండేందుకు తన జీవితం గురించి చెప్పుకొచ్చారు లాటోన్యా. ‘చిన్నతనంలోనే తల్లి కావడం వల్ల డ్రాపౌట్‌గా మిగలాల్సి వచ్చింది. ఎంత కష్టపడినా పిల్లల అవసరాలు తీర్చేందుకు మాత్రమే నా సంపాదన సరిపోతోంది. మొదట స్కూల్ నుంచి తర్వాత జార్జియా స్టేట్ యూనివర్సిటీ నుంచి నన్ను తొలగించినపుడు ఎంతగానో బాధపడ్డాను. ఫీజు కట్టేందుకు డబ్బు సిద్ధం చేసుకున్న ప్రతీసారి నా పిల్లలలకు ఏదో ఒక అవసరం వచ్చి పడేది. అందుకే ప్రతీసారి ఆ డబ్బును వాళ్ల కోసమే ఖర్చు చేసేదాన్ని. ఇప్పుడు 700 డాలర్లు కడితేగానీ నన్ను కాలేజీలో చేర్చుకోరు’ అంటూ 43 ఏళ్ల లాటోన్యా అతడికి తన పరిస్థితి గురించి వివరించింది. ఆ తర్వాత అతడు కారు దిగిపోవడం, ఆ విషయం గురించి లాటోన్యా మరచిపోవడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఓ రోజు లాటోన్యాకు యూనివర్సిటీ నుంచి మెసేజ్ వచ్చింది. ‘ నువ్వు ఇప్పుడు క్లాసులకు హాజరు కావచ్చు’ అన్న పదాలు చూడగానే ఆమె ఎగిరి గంతేశారు. తన కారులో ఎక్కిన ప్రయాణికుడి సహాయంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అంతేగాక తన గ్రాడ్యుయేషన్‌కు అతడు హాజరయ్యాడు. ఊహించని ఈ పరిణామంతో స్వీట్ షాక్‌కు గురైన లాటోన్యా..‘ అతడికి ధన్యవాదాలు.. నాకు 16వ ఏటనే కొడుకు పుట్టాడు. అప్పడే స్కూలు నుంచి తీసివేశారు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు ఇలా. జీవితాన్ని ఎలా మొదలు పెట్టామన్నది కాదు.. ఎలా ముగించామన్నదే ముఖ్యం. ఎప్పుడు ధైర్యాన్ని వదలొద్దు’ అంటూ తన ఫేస్‌బుక్ పేజీలో రాసుకొచ్చారు. ఈ క్రమంలో లాటోన్యా, ఆమెకు సహాయం చేసిన వ్యక్తిపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే విధంగా లాటోన్యా మంచి లాయర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటూ నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment