
మట్టిలో కప్పిపెట్టబడి ఉన్న అతన్ని చూసిన వారు! మొదట అతన్ని..
మాస్కో : ఎలుగు బంటి దాడిలో గాయపడిన ఓ వ్యక్తి నెల రోజుల పాటు నరకం అనుభవించి ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఎలుగు బంటి గుహలో ఆ నెల రోజులు తిండి తిప్పలు లేకుండా చివరకు ఓ మమ్మీలా తయారయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన అలెగ్జాండర్ అనే వ్యక్తి నెల రోజుల క్రితం మంగోలియాకు సమీపంలోని తువా అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆ సమయంలో ఓ గోధుమరంగు ఎలుగు బంటి అతడిపై దాడి చేసి గాయపరిచింది. ఈ దాడిలో అలెగ్జాండర్ వెన్నెముక సైతం విరిగిపోయింది. కదలలేని పరిస్థితిలో అలెగ్జాండర్ అక్కడే కుప్పకూలిపోయాడు. దాడి అనంతరం ఆ ఎలుగుబంటి.. అలెగ్జాండర్‌ను తర్వాత తినొచ్చనే ఉద్ధేశ్యంతో గుహలో పాక్షికంగా పూడ్చేసి వెళ్లిపోయింది.
అయితే ఊపిరి అందే స్థితిలో ఉన‍్న అతడు నెల రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా జీవశ్చవంలా గడిపాడు. కొద్దిరోజుల క్రితం వేటకుక్కలతో ఆ ప్రాంతానికి వచ్చిన వేటగాళ్లు ఎలుగు బంటి గుహలో అతడ్ని గుర్తించారు. మట్టిలో కప్పిపెట్టబడి ఉన్న అతన్ని చూసిన వారు! మొదట అతన్ని ఓ మమ్మీగా భావించారు. అతడు బతికి ఉన్నాడని ధ్రువీకరించుకున్న వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకున్న అలెగ్జాండర్ తను ఎదుర్కొన్న పరిస్థితుల్ని వైద్యులకు వివరించాడు.