కాబూల్: గాల్లో ఇంతెత్తున ఎగురుతూ బీభత్సమైన కరాటే పోజు పెట్టిన ఈ కండలు తిరిగిన యువకుడు ఎవరో గుర్తుపట్టారా? అచ్చం అలనాటి మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్ లీ లా ఉన్నాడు కదూ. ఉండటం ఏమిటి.. అలనాటి బ్రూస్లీ ఫొటోయేనంటారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ కుర్రాడు అఫ్ఘానిస్థాన్కు చెందిన అబ్బాస్ అలీజాదా. నిన్న మొన్నటి వరకు అతడూ మామూలు యువకుడే. కానీ, బ్రూస్లీ ఫొటో పక్కనే తానూ ఫొటో తీయించుకుని, దాన్ని ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగిపోయింది. సోషల్ మీడియాలో అతడికి ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది. 'ఓల్డ్ డ్రాగన్ - న్యూ డ్రాగన్' అనే క్యాప్షన్తో పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో బాగా ప్రచారమైంది. అబ్బాస్ 14 ఏళ్ల వయసులో ఉండగా అతడికి బ్రూస్ లీ యాక్షన్ సినిమాల మీద ఆసక్తి కలిగింది.
బ్రూస్ లీ, జాకీచాన్ లాంటి మార్షల్ ఆర్ట్స్ హీరోల సినిమాలకు అఫ్ఘానిస్థాన్లో ఎప్పుడూ బోలెడంత ఆదరణ ఉంది. అబ్బాస్ లాంటి చాలామంది యువకులు కరాటే, కుంగ్ ఫూ లాంటి యుద్ధవిద్యలు నేర్చుకున్నారు. కొన్నాళ్ల పాటు కాబూల్ స్పోర్ట్స్ క్లబ్బులో శిక్షణ పొందినా, తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆగిపోయాడు. దాంతో ఇంటివద్దే ప్రాక్టీసు చేయడం మొదలుపెట్టాడు. కొంతమంది తనను బాగానే ఆదరిస్తున్నా, మరికొందరు మాత్రం ఫొటోలను ఫొటోషాప్లో మార్చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అబ్బాస్ వాపోయాడు. ఇప్పుడు అతడికి ఏవైనా అవకాశాలు వస్తే వాటి ఆధారంగా ఆ పేద కుటుంబం కాస్త బతకాలని ఆశపడుతోంది.