
ఒర్లాండో: భార్యతో కలసి జీవించేందుకు ఒక సందర్భంలో అమెరికా గ్రీన్‌కార్డ్‌నే వదులుకున్నానని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన పుస్తకం ‘హిట్ రిఫ్రెష్’లో వెల్లడించారు. ఆమె కోసం అమెరికాలో ఉద్యోగం వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చేయాలని కూడా ఒకప్పుడు తీవ్రంగా ఆలోచించానని పుస్తకంలో రాశారు. ‘హిట్ రిఫ్రెష్’ను సత్య అమెరికాలో జరుగుతున్న మైక్రోసాఫ్ట్ ఇగ్నైట్–2017 సదస్సులో సోమవారం ఆవిష్కరించారు.
నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డ్ ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న వారికి అమెరికా వీసా అంత త్వరగా లభించదు. తన భార్య అను తనతోపాటు వచ్చి అమెరికాలో ఉండేందుకు గ్రీన్‌కార్డ్ అడ్డు వస్తున్నందున, ఆయన గ్రీన్‌కార్డ్‌ను వదిలేసి హెచ్–1బీ వీసా తీసుకున్నారట. హెచ్–1బీ వీసా కలిగిన వారు తమ జీవిత భాగస్వామిని అమెరికా తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. తన భార్య కంటే తనకు మరేదీ ఎక్కువ కాదనీ, అందుకే గ్రీన్‌కార్డును వదులుకున్నానని సత్య వివరించారు. ‘అనుతో కలసి ఉండటమే నా ప్రాధాన్యత.
1994లో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లాను. గ్రీన్‌కార్డును వెనక్కు ఇచ్చేసి హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేయాలని అక్కడి క్లర్కుకు చెప్పాను. అతడు నా వైపు అమితాశ్చర్యంగా చూసి...ఎందుకు అని అడిగాడు. గ్రీన్ కార్డు ఉన్నవారు భార్య/భర్తను అమెరికాకు తీసుకెళ్లలేరనే వలస నిబంధన నాకు అడ్డొస్తోందని చెప్పాను. అనంతరం అతను ఇచ్చిన హెచ్–1బీ వీసాకు దరఖాస్తు చేయగా, నాకు మంజూరైంది. అనుని తీసుకుని సియాటెల్ వచ్చి, కొత్త జీవితం ప్రారంభిచాను’ అని సత్య నాదెళ్ల తన పుస్తకంలో వివరించారు.
గ్రీన్‌కార్డ్‌ను వదిలేసినందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీలో తనకు ఒకరకమైన గుర్తింపు లభించిందని సత్య పుస్తకంలో తెలిపారు. ఇంటర్ చదువుతున్న రోజుల్లో తన జీవిత లక్ష్యాలేంటో కూడా సత్య తన పుస్తకంలో రాశారు. హైదరాబాద్ క్రికెట్ జట్టుకు ఆడాలనీ, బ్యాంకు ఉద్యోగం చేయాలని ఆయన కలలుగనేవారట. ఇంజనీర్ అయ్యి, అమెరికా రావాలని ఎప్పుడూ అనుకోలేదని పుస్తకంలో చెప్పుకొచ్చార
ఆధార్ అద్భుత ప్లాట్‌ఫాం...
ప్లాట్‌ఫాం సాంకేతికతల్లో విండోస్, ఆండ్రాయిడ్, ఫేస్‌బుక్‌తో ఆధార్ వ్యవస్థ పోటీపడుతోందంటూ సత్య నాదెళ్ల ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ సాంకేతికత, డిజిటల్ యుగం వైపుకు అడుగులేస్తుండటం శుభపరిణామమని ‘హిట్ రిఫ్రెష్’లో రాశారు. డిజిటల్ చెల్లింపులను పెంచడానికి తెచ్చిన ‘ఇండియాస్టాక్’ను మెచ్చుకున్నారు. ఒకప్పుడు మౌలిక వసతుల లేమితో సతమతమైన భారత్, ప్రస్తుతం డిజిటల్ సాంకేతికత రంగంలో ముందంజలో ఉందని కొనియాడారు.
హెచ్‌పీఎస్ గొప్పతనమిదే
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్‌పీఎస్)లో చదువుకున్న తాను తండ్రి సలహాపై భాగ్యనగరం నుంచి బయటకొచ్చానని సత్య పుస్తకంలో పేర్కొన్నారు. హెచ్‌పీఎస్ గొప్ప తనం గురించి దాని పూర్వ విద్యార్థుల సామర్థ్యాలే చెబుతాయన్న సత్య... ప్రస్తుత అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ సింగ్ బంగ, కేవియం నెట్‌వర్క్స్ అధినేత సయద్ బీ అలీ, టొరంటోలోని ఫెయిర్‌ఫ్యాక్స్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు ప్రేమ్ వత్స, ఇంకా అనేకమంది చట్టసభల సభ్యులు, సినిమా నటులు, క్రీడాకారులు, విద్యావేత్తలు, రచయితలు తమ పాఠశాలలో చదువుకున్నవారేనని పుస్తకంలో పేర్కొన్నారు.