లండన్ : కరోనా వైరస్‌తో పోరాడుతున్న ప్రపంచానికి తమ వంతు సాయం చేస్తామంటూ కొందరు కుబేరులు ఉదారంగా ముందుకొచ్చారు. ఈ మహమ్మారి నుంచి ప్రపంచం కోలుకునేందుకు తమ వంటి అత్యంత సంపన్నులపై కోవిడ్-19 ట్యాక్స్ విధించాలని 80 మందికి పైగా మిలియనీర్లు ప్రభుత్వాలకు విజ‍్క్షప్తి చేశారు. మానవత్వం కోసం మిలియనీర్లుగా తమను తాము అభివర్ణించుకున్న వీరంతా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో సంపన్నులపై కోవిడ్ పన్ను వసూలు చేయాలని కోరారు. కుబేరులపై అధిక పన్నును సత్వరమే శాశ్వత ప్రాతిపదికన విధించాలని ఈ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఫిల్మ్ మేకర్ అభిగల్ డిస్నీ, స్క్రీన్‌రైటర్ రిచర్డ్ కర్టిస్, బెన్ అండ్ జెర్రీ ఐస్‌క్రీం సహవ్యవస్ధాపకులు జెర్రీ గ్రీన్‌ఫీల్డ్, అమెరికన్ వ్యాపారవేత్త సిడ్నీ టోపాల్, న్యూజిలాండ్ రీటైలర్ స్టీఫెన్ టిండాల్ తదితర ప్రముఖులు ఈ లేఖపై సంతకం చేసిన వారిలో ఉన్నారు. కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తమ వంటి మిలియనీర్లు ప్రపంచం కోలుకునేందుకు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని లేఖలో వారు స్పష్టం చేశారు.
తాము ఇంటెన్సివ్ కేర్ వార్డుల్లో ఉండే రోగుల పట్ల జాగ్రత్త వహించలేమని, రోగులను తరలించేందుకు అంబులెన్స్‌లను నడపలేమని, ఇంటింటికీ ఆహారం అందించలేమని..అయితే తమ వద్ద పేరుకుపోయిన డబ్బుతో అవసరార్ధులకు సాయం చేయగలమని వారు పేర్కొన్నారు. ఈ సంక్షోభం నుంచి ప్రపంచం గట్టెక్కేందుకు రాబోయే రోజుల్లో డబ్బు అవసరం అధికంగా ఉందని అన్నారు. జీ20 ఆర్థిక మంత్రుల సమావేశానికి ముందు అత్యంత సంపన్నులు ఈ లేఖను ప్రభుత్వాల ముందుంచడం గమనార్హం. మహమ్మారి విరుచుకుపడటంతో ఎదురయ్యే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించేందుకు ఇప్పటికే పలు ప్రభుత్వాలు సంపన్నులపై పన్నులను పెంచాయి. చదవండి : కపూర్ కుటుంబంలో కరోనా కలకలం!
అధిక పన్నులు విధించడం మినహా మరో మార్గం లేదని బ్రిటన్‌కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిస్కల్ స్టడీస్ స్పష్టం చేసింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంఛెజ్ సైతం అధిక పన్నులకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఇటీవల సంకేతాలు పంపారు. కరోనా వైరస్ ప్రభావంతో పడిపోయిన రాబడిని పెంచుకునేందుకు అధిక ఆదాయ వనరులు కలిగిన పౌరులను రష్యా టార్గెట్ చేసుకంది. ఇక చమురు ధరలు తగ్గడం, వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు సౌదీ అరేబియా సేల్స్ ట్యాక్స్‌ను పెంచింది. కాగా ఆక్స్‌ఫాం, ట్యాక్స్ జస్టిస్ బ్రిటన్, అమెరికాలో అత్యంత సంపన్నులతో కూడిన పేట్రియాటిక్ మిలియనీర్స్ వంటి గ్రూపులతో కూడిన మిలియనీర్స్ ఫర్ హ్యూమనిటీ వేదిక ఏర్పాటైంది.
Comments
Please login to add a commentAdd a comment