
ఫుడాన్ యూనివర్శిటీలో గీతా పఠనం
షాంఘై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మూడోరోజు పర్యటనలో భాగంగా చైనాలోని షాంఘై పట్టణంలో ఉన్న ఫుదాన్ యూనివర్సిటీని శనివారం సందర్శించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. రెండు యూనివర్సిటీల విద్యార్థులను కలవడం ఆనందంగా ఉందన్నారు. విదేశాల్లో యూనివర్సిటీల విద్యార్థులను కలవడం చాలా అరుదుగా నాయకులకు లభిస్తుందని అలాంటి అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
భారత్-చైనా సత్సంబంధాలతో భవిష్యత్తరాలకు చాలా మేలు జరుగుతుందన్నారు. మోదీ ప్రసంగం ముగియగానే మోదీ, మోదీ అంటూ ఫుదాన్ యూనివర్సిటీలో నినాదాలు మార్మోగాయి. మరోవైపు మోదీని చూసేందుకు ఫుదాన్ వర్సిటీకి ఎన్నారైలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మోదీతో పలువురు ఎన్నారైలు సెల్ఫీలు దిగారు.
ప్రపంచానికి రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయని ఒకటి ఉగ్రవాదం, రెండోది గ్లోబల్ వార్మింగ్ అన్నారు. ఉగ్రవాదంపై పోరాటానికి గాంధేయ మార్గమే మంచిదని భావిస్తున్నామన్నారు. అలాగే గ్లోబల్ వార్మింగ్కు కూడా గాంధీయే మార్గమే సరైందన్నారు.
ఈ సందర్భంగా యూనివర్శిటీలోని చారిత్రాత్మకమైన సెంటర్ ఫర్ గాంధీయన్ అండ్ ఇండియన్ స్టడీస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతిపితి గాంధీ మహాత్ముని సిద్దాంతాలు, ఆచరణ ప్రపంచంలో వున్న మానవులందరికీ ఆదర్శం కావాలన్నారు. ఆయన విశ్వమానవుడని, యుగపురుషుడని ప్రధాని కొనియాడారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చైనా విద్యార్థులు భగవద్గీతను శ్లోకాలను పఠించారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి విశ్వరూప్ ట్విట్ చేశారు.