టుస్సాడ్స్ మ్యూజియంలో మోదీ మైనపు బొమ్మ
లండన్: ప్రపంచ ప్రముఖులకు దక్కిన అరుదైన గౌరవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అందుకోనున్నారు. లండన్, సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్‌లలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలలో మోదీ మైనపు బొమ్మను ఉంచనున్నట్లు మ్యూజియం అధికారులు వెల్లడించారు. ప్రపంచ రాజకీయాల్లో మోదీ ప్రముఖంగా, ప్రత్యేకంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ ఏడాది ప్రారంభంలో తనతో చర్చించేందుకు టుస్సాడ్స్ కళాకారులు, నిపుణుల బృందానికి మోదీ సమయమిచ్చారని తెలిపారు.
బుధవారం ఢిల్లీలో నిపుణులు మోదీ కొలతలు తీసుకున్నారు. ‘ప్రపంచంలోని ప్రముఖుల సరసన నా బొమ్మ పెట్టేంత గౌరవం నాకుందా? అనిపించింది. ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని టుస్సాడ్స్ టీం తెలిపింది. గతంలో మూడు నాలుగు సార్లు.. ఈ మ్యూజియాన్ని సందర్శించాను. ప్రముఖుల బొమ్మల పక్కన నిలబడి ఫొటోలు కూడా తీసుకున్నాను’ అని మ్యూజియంకు ఇచ్చిన ప్రకటనలో మోదీ పేర్కొన్నారు.