సిరియాకు తరలుతున్నమహిళలు, పిల్లలు!
బ్రిటన్ మహిళలు, బాలికలు జిహాదీలుగా మారుతున్నారు. యుద్ధ భూమిగా మారిన సిరియాకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. కౌంటర్ టెర్రరిజమ్ పోలీసులు తాజాగా విడుదల చేసిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కాల్ఫేట్ లోని జీవితంపై ఐఎస్ ప్రచారానికి.. వీరంతా ఆకర్షితులౌతుండటంపై కౌంటర్ టెర్రరిజం జాతీయ సమన్వయకర్త హెలెన్ బాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు.
2014 సంవత్సరంలో నలభైమూడు మంది మహిళలు సిరియాకు వెళ్ళగా అది గత సంవత్సరం పదమూడు పెరిగి 56 కు చేరినట్లు తాజా గణాంకాలు వివరిస్తున్నాయి. 2015 లో బ్రిటన్ నుంచి దాదాపు ఏభై ఆరు మంది మహిళలు, బాలికలు సిరియాకు పారిపోయారని లెక్కలు చెప్తున్నాయి. ముగ్గురు సిరియన్ శరణార్థులు వీడియోలో చెప్పిన వివరాలను బట్టి పోలీసులు ఈ తాజా గణాంకాలను వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల్లో చేరేందుకు సిరియా వెడుతున్నవారందరినీ ఈ వీడియో (షార్ట్ ఫిల్మ్) హెచ్చరిస్తోంది. సిరియా వెళ్ళేందుకు ఎంతోమంది మహిళలు, బాలికలే కాక అనేక కుటుంబాలు కూడ ఇష్టం చూపిస్తున్నాయని, ఇది ఆందోళనకరమైన పరిస్థితి అని ఓ మహిళ చెప్తుండగా... అలా ఆకర్షితులై వచ్చిన వారికి వాస్తవాలు తెలియకపోవడం వల్ల అనేక అనర్థాలు కలిగే అవకాశాలు ఉన్నాయని మరో మహిళ హెచ్చరిస్తోంది. నిజానికి ఆ యుద్ధ భూమిలో నివసించే మహిళలు, పిల్లలకు జీవితం ఎంతో కఠినంగా ఉందని ఆ మహిళల మాటలను బట్టి తెలుస్తోంది. అయితే వారంతా అక్కడి మహిళలకు సహాయం అందించేందుకు వెడుతున్నట్లు భావిస్తున్నారని, వారు చేస్తున్నది తప్పు అన్న విషయం వారికి అర్థమైతే వారు వెళ్ళే అవకాశం ఉండదని హెలెన్ బాల్ అంటున్నారు.
ఉగ్రవాదాన్ని నిర్మూలించే లక్ష్యంతో ప్రచారాన్ని ప్రారంభించిన ప్రివెంట్ ట్రాజెడీస్ వెబ్ సైట్ కు ఆ ముగ్గురు మహిళలు స్వయంగా బహిరంగ లేఖలు కూడ రాసిచ్చారు. అంతేకాదు ఓ తల్లి తన భర్తను కాల్చి చంపేశారని కూడ చెప్పింది. తన కథను వారి వారి కూతుళ్ళకు వివరించమని, సిరియా ఎంతో ప్రమాదకరమైన ప్రాంతమని పిల్లలతో నివసించదగ్గ ప్రాంతం కాదని ఆమె లేఖలో హెచ్చరించింది. లండన్ కు మించిన స్వేచ్ఛ కలిగిన ప్రాంతం సిరియా కాదని, ఐఎస్ ఐఎస్ అధీనంలోని సిరియా అత్యంత ప్రమాదకరమని పిల్లలకు వివరించమంటోంది. ఐఎస్ ఐఎస్ నిజానికి ఇస్లాంను పాటించడం లేదని, వారు ముస్లింలు కాదని కూడ ఆమె ఆవేశంగా చెప్తోంది. ఇస్లాం పేరున ప్రజలను మోసగించి ఉగ్రవాదంలోకి దింపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవలి కాలంలో హై ప్రొఫైల్ కేసుల్లోని 15 ఏళ్ళ షర్మినా బేగం, అమీరా అబాసేలు ఒకే పాఠశాల్లోని స్నేహితులని, అలాగే 16 ఏళ్ళ కడీజా సుల్తానా సహా అందరూ లండన్ బెథ్నాల్ గ్రీన్ ప్రాంతం నుంచి వచ్చిన వారేనని ఆమె చెప్తోంది. అయితే ఫిబ్రవరి ప్రాంతంలో సిరియాకు చేరిన వీరు.. ఇప్పుడు ఐఎస్ ఐఎస్ ఫైటర్లను వివాహమాడేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన సహాయం ఏమిటంటే సిరియాకు, అటువంటి ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్ళేవారిని అడ్డుకోవడమేనని కౌంటర్ టెర్రరిజం అసిస్టెంట్ ఛీఫ్ కానిస్టేబుల్ ఏంజెలా విలియమ్స్ అంటున్నారు. పిల్లలు సహా ఎవరైనా అటువంటి ప్రమాదానికి దగ్గరౌతుంటే వారిలో అవగాహన కల్పించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని తల్లులు... వారి పిల్లలు సిరియా ప్రయాణంపట్ల ఇష్టాన్ని చూపుతున్నా, అటువంటి సమస్యలున్నా వారు ముందుకు రావాలని సందేశం సూచిస్తున్నారు.