గురువారం జైపూర్‌లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తున్న జేపీ నడ్డా, మాజీ సీఎం వసుంధరా రాజె, కేంద్ర మంత్రి షెకావత్
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీకి ఈ నెల 25న జరగనున్న ఎన్నికలకు బీజేపీ గురువారం మేనిఫోస్టోను విడుదల చేసింది. ఉజ్వల పథకం లబ్ధిదారులకిచ్చే వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.450 చొప్పున సబ్సిడీ, వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పీఎం కిసాన్ యోజన కింద రైతులకిచ్చే ఆర్థిక సాయం పెంపు వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ మేరకు మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను బీ జేపీ చీఫ్ జేపీ నడ్డా గురువారం జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా నడ్డా ప్రకటించారు.
సంకల్ప పత్రలోని మరికొన్ని హామీలు..
- గోధుమలను కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు బోనస్‌తో కలిపి క్వింటాలుకు రూ.2,700 చొప్పున కొనుగోలు.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఆర్థిక సాయం ఏడాదికి రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంపు.
- ఈస్టర్న్ రాజస్తాన్ కెనాల్ ప్రాజెక్టు(ఈఆర్‌సీపీ)ను కేంద్రం సాయంతో నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయడం. ఈ ప్రాజెక్టుతో 13 జిల్లాలకు తాగు, సాగునీటి సమస్య తీరుతుంది.
మహిళలు, బాలికల కోసం...
- జిల్లాకో మహిళా పోలీస్ స్టేషన్. ప్రతి పోలీస్ స్టేషన్‌లో మహిళా డెస్క్..ప్రతి నగరంలో యాంటీ రోమియో స్క్వాడ్‌ల ఏర్పాటు.
- లాడో ప్రోత్సాహన్ యోజన కింద పుట్టిన ప్రతి బాలిక పేరిట రూ.2 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్.
- లక్పతి దీదీ పథకం ద్వారా ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ.
- 12వ తరగతి పూర్తి చేసుకున్న ప్రతిభావంతులైన బాలికలకు స్కూటీల పంపిణీ.
- పేద కుటుంబాల బాలికలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.
- రాష్ట్రంలో మూడు మహిళా బెటాలియన్ల ఏర్పాటు.
- పీఎం మాతృ వందన్ పథకం కింద అందించే ఆర్థిక సాయం రూ.5 వేల నుంచి 8 వేలకు పెంపు.
యువత కోసం..
- వచ్చే అయిదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ
- పేద కుటుంబాల విద్యార్థులు పుస్తకాలు, దుస్తులు కొనుక్కునేందుకు ఏటా రూ.12 వేలు పంపిణీ.
- ప్రతి డివిజన్‌లో రాజస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రాజస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏర్పాటు.
ఆరోగ్యరంగంలో..
- భామాషా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా ఆరోగ్య రంగంపై రూ.40 వేల కోట్ల పెట్టుబడి
- కొత్తగా 15 వేల మంది వైద్యులు, 20 వేల పారామెడికల్ సిబ్బంది నియామకం.
వీటితోపాటు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, జైపూర్ మెట్రో విస్తరణ, పారదర్శక బదిలీ విధానం, పేద కుటుంబాలకు ఉచిత రేషన్, దివ్యాంగులకు రూ.1,500 పింఛను, వృద్ధాప్య పింఛను పెంపు వంటివి ఉన్నాయి. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 350 బిలియన్ డాలర్లకు పెంచుతామని వాగ్దానం చేసింది. జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, అజీ్మర్, జోథ్‌పూర్, బికనీర్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడాన్ని కూడా మేనిఫెస్టో పేర్కొంది. ఓబీసీలకు నిర్ణిత వ్యవధిలో ధ్రువీకరణ పత్రాల జారీ, వారికి రూ.15 వరకు విద్యారుణం. ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు. ఇవి కాకుండా, ఎస్‌సీ,ఎస్‌టీలు, గిరిజనులు, వీధి వ్యాపారులు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment