మూడేళ్ల కూతురిని చంపి.. దాచిపెట్టిన తల్లి
మూడేళ్ల కూతురిని చంపి.. దాచిపెట్టిన తల్లి
Published Mon, Nov 7 2016 9:10 AM | Last Updated on Tue, Aug 28 2018 7:09 PM
మూడేళ్ల కూతురిని చంపి.. ఆ విషయాన్ని ఐదేళ్ల పాటు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టిందో కన్నతల్లి. ఆలియా లన్స్‌ఫర్డ్ (3) అనే అమ్మాయిని ఆమె తల్లి లీనల్ లన్స్‌ఫర్డ్ స్వయంగా చంపిందన్న విషయాన్ని పోలీసులు ప్రకటించేసరికి అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తలమీద బలమైన వస్తువుతో కొట్టి ఆమెను చంపేసిందని తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి, తన కూతురు కనిపించడం లేదంటూ 2011 సెప్టెంబర్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పోలీసులు ఆ చిన్నారి ఎక్కడుందా అని వెతుకుతూనే ఉన్నారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరకు.. కన్నకూతుర్ని చంపిన కేసులో లీనల్ లన్స్‌ఫర్డ్‌ను అరెస్టుచేశారు. అయితే, చిన్నారి మృతదేహం మాత్రం ఎక్కడుందన్న విషయం ఇంతవరకు తెలియలేదు.
ఇంట్లోనే ఉన్న తన కూతురు కనిపించడం లేదని సెప్టెంబర్ 24న లన్స్‌ఫర్డ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆరు నెలల తర్వాత.. ఎవరో ఇంట్లోకి వచ్చి పిల్లను ఎత్తుకెళ్లిపోయారంటే నమ్మబుద్ధి కావడం లేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. చిన్నారి ఎక్కడుందన్న సమాచారం తెలిపినా, నిందితుల అరెస్టుకు దారితీసే విషయాలు ఏవైనా వెల్లడించినా రూ. 13 లక్షల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించారు. వయసు పెరిగేకొద్దీ ఆలియా ఎలా ఉంటుందో అనే ఊహా చిత్రాలను కూడా రూపొందించి.. వాటితో కూడిన పోస్టర్లు అన్నిచోట్లా అతికించారు. అయినా, ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు, ఎవరూ అరెస్టు కాలేదు. చివరకు పోలీసులకు స్టన్నింగ్ వాస్తవం తెలిసింది. కన్న తల్లే ఈ దారుణానికి పాల్పడిందని వెల్లడించి.. ఆమెను అరెస్టుచేశారు. కూతురిఉ కనిపించడం లేదని ఫిర్యాదు చేసే సమయానికి లన్స్‌ఫర్డ్ గర్భవతి. తర్వాత ఆమెకు కవలలు పుట్టారు. తర్వాత ఆమకు మొత్తం ఆరుగురు పిల్లలుండగా వారిపై మాతృత్వ హక్కులను కూడా ఆమె కోల్పోయింది. తల్లిగా ఉండే అర్హత ఆమెకు లేదని కోర్టు తెలిపింది.
Advertisement