
‘మమ్మీ’ రాకుమారి సొంత దేశానికి తిరిగి వెళ్లిపోయింది..
సూకర్ : 500 ఏళ్లనాటి బొలీవియన్ ‘మమ్మీ’ రాకుమారి సొంత దేశానికి తిరిగి వెళ్లిపోయింది. 129 సంవత్సరాల క్రితం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ మ్యూజియానికి ఇచ్చిన మమ్మీని బొలీవియా వెనక్కు తెప్పించుకుంది. ఇతర దేశాలకు ఇచ్చిన పురాతన వస్తువులను తిరిగి తెచ్చే చర్యల్లో భాగంగా బొలీవియా ఈ నిర్ణయం తీసుకుంది. లా పజ్‌లోని యూఎస్ ఎంబసీ అధికారుల సహకారంతో మమ్మీ సొంత దేశానికి తరలివెళ్లింది. నవంబర్‌నుంచి బొలీవియన్ విద్యావేత్తలు, ఇతర పరిశోధకుల నేతృత్వంలో రాకుమారిపై పరిశోధనలు జరిగే అవకాశం ఉంది.
ఈ మమ్మీ 15వ శతాబ్దానికి చెందినదని రేడియో కార్బన్ పరిశోధనల్లో తేలింది. రాకుమారి ఆండియన్ హైలాండ్స్‌కు దగ్గరలోని లా పజ్ ‘‘ఇంకా నాగరిత’’కు చెందినదిగా పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఈమె ఏనిమిదేళ్ల వయస్సులో సమాధి చేయబడినట్లు భావిస్తున్నారు. సమాధి నుంచి వెలికి తీసినపుడు రాకుమారి చెప్పులు ధరించి ఉంది. మట్టి పాత్రలతో పాటు ఇతర వస్తువులు, ఈకలు, మొక్కలు సమాధిలో ఉన్నాయి. ఇప్పటికీ మమ్మీ రాకుమారి చేతి వేళ్ల మధ్య ఈకలు ఉండటం మనం గమనించవచ్చు.
