భార్యతో జెరెమీ హంట్ (ఫైల్ ఫోటో)
బీజింగ్ : బ్రిటన్ నూతన విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ తాజాగా చైనాలో చేపట్టిన తన తొలి పర్యటనలోనే తడబడ్డారు. తన భార్య చైనీయురాలిని గుర్తుచేసి.. చైనీయుల మనసు గెలుచుకుందామని ఆయన అనుకున్నారు. కానీ, ఆ విషయాన్ని చెప్పడంలో తడబడ్డారు. తన భార్య జపనీస్ అంటూ చెప్పేశారు. వెంటనే నాలుక కర్చుకున్న ఆయన.. కాదు.. కాదు చైనీస్ అంటూ సర్దిచెప్పారు. చైనా-జపాన్ దేశాలు శతాబ్దాలుగా సంప్రదాయ ప్రత్యర్థులు కావడంతో ఆయన చేసిన పొరపాటుతో ఒకింత ఇబ్బందిపడాల్సి వచ్చింది.
చైనా-జపాన్ మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కొంత మెరుగుపడినప్పటికీ 1930-40లో చైనా భూభాగాలను జపాన్ ఆక్రమించిన విషయం తెలిసిందే. పొరపాటున వెంటనే గుర్తించిన హంగ్ తేరుకుని వివరణ కూడా ఇచ్చాడు. ‘నా భార్య చైనీస్, మా పిల్లలకు చైనా మూలాలున్నాయి. చైనాలోని జియాన్ ప్రావిన్స్‌లో నా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు’ అని అన్నారని చెప్తూ.. చైనీయులు మనసు గెలుచుకునే ప్రయత్నం చేశారు.
బ్రిటన్ మంత్రి అయిన హంట్.. చైనీ మూలాలున్న లూసియా గుయోను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. గత ఏడాది బ్రెగ్జిట్ ద్వారా యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ నిష్కమించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈయూతో బ్రిటన్ పూర్తిగా వాణిజ్య సంబంధాలను తెంచుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ నూతన విదేశాంగ మంత్రిగా నియమితులైన హంట్ చైనాతో దౌత్యపరమైన, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సోమవారం బీజింగ్‌లో పర్యటించారు. వర్తకం, అభివృద్ధి, భద్రత వంటి అంశాల్లో బ్రిటన్-చైనా కలిసి పనిచేస్తాయని హంగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment