ఈ 'నగ్న రెస్టారెంట్'లో బట్టలిప్పి భోజనం చేస్తారు!
లండన్: భోజన ప్రియులకోసం లండన్ లోని ఓ హోటల్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. విభిన్నరుచులను చవిచూడాలనుకునే వారికోసం కొత్త పోకడకు తెరతీసింది. ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు ప్రత్యేక టాప్ అప్ లతో ఆహ్వానం పలుకుతోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభానికి స్థానిక ఔల్ కేఫ్.. శ్రీకారం చుట్టింది. లండన్ ప్రజలకు మరింత చేరువవ్వాలన్న ఉద్దేశంతో ఔల్ కేఫ్.. కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు 'నేకెడ్ రెస్టారెంట్' (నగ్న రెస్టారెంట్)ను ప్రారంభిస్తోంది.
ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఎక్కడా లేని అదనపు సౌకర్యాలను వినియోగదారులకు అందించేందుకు ఈ హోటల్ ముందుకొచ్చింది. ఇంతకుముందు కడిల్ కేఫ్ లో కాఫీ, స్నాక్స్, టీతోపాటు కౌగిలింతల సౌకర్యాన్ని కూడా అందుకున్న లండన్ ప్రజలకు, ఇప్పుడు ఔల్ కేఫ్ బర్త్ డే డ్రెస్ (నగ్నంగా) తో భుజించే ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. నగరంలోని భూగర్భ రైల్వే నెట్‌వర్క్ లండన్ ట్యూబ్.. కూడా ప్రస్తుతం పాప్ అప్ రెస్టారెంట్ గా మారిపోయింది. బ్రిటన్ రాజధానిలో భోజన ప్రియులకు ప్రత్యేక అనుభూతులను అందించేందుకు విభిన్నంగా ఆలోచించిన ఈ సంస్థ.. దుస్తులు తొలగించి మరీ (నగ్నంగా) భోజనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. విడిచిన దుస్తులు, ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకొనేందుకు హోటల్ ప్రత్యేక లాకర్ల వసతిని కల్పిస్తుందట. భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా, ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. గోప్యతకు వీలుగా రెస్టారెంట్లో బ్యాంబూ పార్టిషన్లతోపాటు ప్రత్యేక స్థలాన్ని కేటాయించిందట. ఇక్కడి సభ్యులు, సిబ్బంది కూడా కురుచ దుస్తులు ధరించి ఈ రెస్టారెంట్‌కు వచ్చేసారి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది.
బున్యాది పేరుతో ఈ కొత్త రకం రెస్టారెంట్ సెంట్రల్ లండన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ లభించే ప్రత్యేక సౌకర్యాలు, డిన్నర్లు, వంటి అనుభవాలను రుచిచూసేందుకు ముందుగా బున్యాది డాట్ కామ్ (thebunyadi.com) లో రిజిస్టర్ చేసుకోవచ్చట. ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు ఈ కొత్త భోజనశాలను పరీక్షించేందుకు సైన్ అప్ చేశారట. దుస్తుల సంకెళ్ళనుండి విముక్తులను చేయడం, ఆధునిక జీవితంలో సరికొత్త అనుభవాలను చవి చూసేందుకు వీలుగా ఈ రెస్టారెంట్ ఉంటుందట. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదట. ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాదు పూర్వకాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం, మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి కూడ ఇక్కడి సౌకర్యాల్లో భాగమే. ఈ రెస్టారెంట్లో 'నేకెడ్'' మాత్రమే కాదు 'నాన్ నేకెడ్' సెక్షన్ కూడ వేరుగా ఉంటుందట.