ఖట్మండు : నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామాకు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ)లో పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత పుష్ప కమల్ దహల్ ప్రధాని ఓలీతో ఆదివారం సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమావేశానికి ముందు దహల్ నేపాల్ అధ్యక్షులు బిద్యా దేవి భండారితో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వెలువడ్డాయి. నేపాల్ ప్రధాని నియంత పోకడలు, భారత్ వ్యతిరేక ప్రకటనల నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించేందుకు నేపాల్ పాలక కమ్యూనిస్టు పార్టీ ఈ నెల 6న కీలక భేటీ జరపనుంది. ఓలీ రాజీనామాకు పట్టుబడుతున్న నేతలు ఈ దిశగా పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. 45 మంది సభ్యులతో కూడిన ఎన్‌సీపీ స్టాండింగ్ కమిటీ ఈనెల 4న భేటీ కావాల్సి ఉండగా చివరినిమిషంలో సమావేశం వాయిదాపడింది.
ప్రధానమంత్రి పదవితో పాటు పార్టీ సహ అధ్యక్ష పదవికీ ఓలీ రాజీనామా చేయాలని ఆయన వ్యతిరేకులు పట్టుబడుతుండగా, పదవుల నుంచి వైదొలగేందుకు ఆయన సుముఖంగా లేరని హిమాయలన్ టైమ్స్ పేర్కొంది. ఒప్పందానికి భిన్నంగా పూర్తికాలం పదవిలో కొనసాగేందుకు తాను ఓలీకి అవకాశం ఇచ్చినా దేశాన్ని సమర్ధంగా ముందుకుతీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యారని ఎన్‌సీపీ సీనియర్ నేత దహల్ ఆరోపిస్తున్నారు. ఈ వివాదం ఎన్‌సీపీలో చిచ్చురేపుతోందని పార్టీ స్టాండింగ్ కమిటీ సభ్యులు హరిబోల్ గజురెల్ పేర్కొన్నారు. ఓలీ, దహల్‌లు తమ మంకుపట్టు వీడకపోవడంతో పార్టీలో ప్రతిష్టంభన కొనసాగుతోందని చెప్పారు.
మరోవైపు నేపాల్ ప్రధాని ఓలీని తప్పించేందుకు దహల్ వర్గీయులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తే పార్టీ నిట్టనిలువునా చీలిపోతుందని ఎన్‌సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కాగా, తనను పదవి నుంచి తొలగించేందుకు భారత్ కుట్ర చేస్తోందని, కొంతమంది నేపాల్ నాయకులు సైతం ఈ కుట్రలో భాగస్వామ్యలు అయ్యారని ప్రధాని ఓలీ ఆరోపిస్తున్నారు. ఇక ఓలీ వ్యవహారశైలిపై భగ్గుమంటున్న పుష్ప కమల్ దహల్, మాధవ్ కుమార్ నేపాల్, జలనాథ్ ఖనల్ వంటి ముఖ్యనేతలు ప్రధాని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment