
సియోల్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఉత్తర కొరియా జరిపిన అణు, క్షిపణి పరీక్షలను సమీక్షించిన ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్‌ఏ) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా, దాని మిత్ర పక్షాల బ్లాక్‌మెయిల్, సైనిక విన్యాసాల నేపథ్యంలోనే నార్త్ కొరియా స్వీయ రక్షణకు అణు సామర్థ్యాలను పెంచుకుందని పేర్కొంది.
ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత విధానాలను అవలంబిస్తూ, దాడులకు పాల్పడతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ‘ఉత్తర కొరియా కొత్త వ్యూహాత్మక, అణుశక్తిగా ఎదిగిందనడంలో సందేహం అక్కర్లేదు. మా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అజేయ శక్తిగా మారిన ఉత్తర కొరియాను బలహీనపరచలేరు, అణగదొక్కలేర’ ని కేసీఎన్‌ఏ వ్యాఖ్యానించింది.