అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లేప్పుడు ఉపయోగించే విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ గా వ్యహరిస్తారనే విషయం తెల్సిందే.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు విదేశీ పర్యటనకు వెళ్లేప్పుడు ఉపయోగించే విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్ వన్’ గా వ్యహరిస్తారనే విషయం తెల్సిందే. అమెరికా ఆధ్యక్షుడు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని సాంకేతికంగా 747-200 బీ జంబో జెట్‌గా వ్యవహరిస్తారు. ఇదే విమానంలో బరాక్ ఒబామా ఇటీవల భారత్ పర్యటనకు వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఆ స్థానంలో ఆధునీకరించిన బోయింగ్ 747-8 (సాంకేతికనామం) విమానాన్ని తీసుకరావాలని నిర్ణయించారు. ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే గత 30 ఏళ్లుగా అమెరికా అధ్యక్షుడు 747-200బీ వెర్షన్ విమానాన్ని వాడుతున్నారని, సాంకేతక రంగంలో వచ్చిన మార్పులతో ఆధునీకరించిన కొత్త విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్ వన్’గా తీసుకరావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఎయిర్ ఫోర్స్ సెక్రటరీ దెబోరా లీ జేమ్స్ మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలియజేశారు.
అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరింత పటిష్టంగా తీర్చిదిద్దడంతోపాటు ఇంధనం ట్యాంక్ సామర్థ్యాన్ని కూడా పెంచామని ఆయన చెప్పారు. సకల హంగులు కలిగిన ఈ విమానాన్ని తొలిసారిగా అమెరికాలోనే ఉత్పత్తి చేసినట్టు, దీనికి రూ. 2,286 కోట్లు ఖర్చయినట్టు ఆయన తెలిపారు. అయితే ఈ విమానం దేశాధ్యక్షుడికి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.
ప్రస్తుత ఎయిర్ ఫోర్స్ వన్‌లో కూడా సకల సౌకర్యాలు ఉన్నాయి. అధ్యక్షుడితోపాటు ఆయన అంగరక్షకులు, వైట్‌హౌజ్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన మంత్రులు, మార్బలం ప్రయాణించేందుకు అవసరమైన వసతులన్నీ ఉన్నాయి. అధ్యక్షుడితోపాటు వైట్‌హౌజ్ సిబ్బంది బస చేయడానికి ప్రత్యేక గదులు, వారు సమావేశమవడానికి ప్రత్యేక హాళ్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు ఓ ఆస్పత్రి కూడా ఉంది. ఒకేసారి రెండు వేల మందికి భోజనం తయారు చేయడమే కాకుండా అంతమందికి ఒకేసారి సర్వ్‌చేసే అవకాశం కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా బాంబు దాడులే కాకుండా అణ్వస్త్రాలను తట్టుకునే శక్తి కూడా ఈ విమానానికి ఉంది. అణు బాంబుల దాడి సందర్భంగా వెలువడే అణు ధార్మిక తరంగాలను నిలువరించే ప్రత్యేక కవచం కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘వైట్ హౌజ్’కు రెక్కలు తొడిగితే ఎలా ఉంటుందో ఎయిర్ ఫోర్స్ వన్ అలా ఉంటుంది. గతనతలంలో ఎక్కడ ఉన్నా అమెరికా అధ్యక్షుడు ‘వైట్ హౌజ్’లో ఉన్నట్టుగా విధులు నిర్వహించేందుకు వీలుగా ఇందులో ఏర్పాట్లు ఉంటాయి. ఒక్కసారి ఇంధనం నింపితే సగం ప్రపంచాన్ని చుట్టి రావచ్చు. గగనతలంలోనే ఇంధనాన్ని నింపుకొనే సౌకర్యం కూడా దీనికి ఉంది.
సాధారణంగా ఎయిర్ ఫోర్స్ వన్ రెండు విమానాలు ఉంటాయి. అధ్యక్షుడు ఏ విమానంలో వెళతారనేది చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచుతారు. అధ్యక్షుడు ఎక్కిన విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్‌గా వ్యవహరిస్తారు. ఈ విమానం నిర్వహణ బాధ్యతలను మెరైన్ కోర్ చూస్తోంది. దేశాధ్యక్షుడు ఈ విమానంలో దేశంలోపల ప్రయాణిస్తే ‘మెరైన్ వన్’గా వ్యవహరిస్తారు. చాలా అరుదుగా అధ్యక్షుడు ఆర్మీ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారు. అప్పుడు దాన్ని ‘ఆర్మీ వన్’గా వ్యవహరిస్తారు. ఇక ఉపాధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని ‘ఎయిర్ ఫోర్స్-టూ’గా వ్యవహరిస్తారు.
-అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ 1963, నవంబర్ 22వ తేదీన టెక్సాస్‌లోని డల్లాస్‌లో హత్యకు గురైనప్పుడు ఆయన భౌతికదేహాన్ని ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోనే వాషింగ్టన్ తీసుకొచ్చారు.
-కెనెడీ స్థానంలో అమెరికా 36వ అధ్యక్షుడిగా లిండన్ జాన్సన్ పదవీ బాధ్యతలు స్వీకరించినదీ ఈ విమానంలోనే.
-చైనాను సందర్శించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ ప్రయాణించిందీ ఈ విమానంలోనే.
-ఒసామా బిన్ లాడెన్ సారథ్యంలో టెర్రరిస్టులు 9/11 దాడులు జరిపినప్పుడు అప్పటి దేశాధ్యక్షుడు జార్జి డ బ్ల్యూ బుష్ పాలనాపరమైన ఆదేశాలను ఈ విమానం నుంచే ఇచ్చారు.
-ఎయిర్ ఫోర్స్ వన్ టైటిల్‌తో 1997లో వచ్చిన హాలీవుడ్ సినిమాతో ఈ విమానం ప్రత్యేకతల గురించి సామాన్య ప్రజలకు కూడా తెల్సింది. హారిసన్ ఫోర్డ్ నటించిన ఆ సినిమాలో ఎయిర్ ఫోర్స్ వన్‌ను రష్యన్లు హైజాక్ చేయడం సినిమా ఇతివృత్తం.