
మహమ్మారి కేన్సర్‌ను చటుక్కున గుర్తించేందుకు తయారైన సరికొత్త పరికరం ఇది. పేరు బ్రెత్ బయాప్సీ. బిల్లీ బాయల్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త అభివృద్ధి చేసిన ఈ గాడ్జెట్ కేవలం మన ఊపిరి ఆధారంగానే వ్యాధి నిర్ధారణ చేస్తుంది. భార్య కేట్‌కు ఉన్న పెద్దపేగు కేన్సర్‌ను సకాలంలో గుర్తించకపోవడం.. ఫలితంగా చిన్న వయసులోనే ఆమె మరణించడం బాయల్ మనసును కలచివేసింది. ఇలాంటి చావు ఇతరులెవ్వరికీ రాకూడదని, వీలైనంత ముందుగా కేన్సర్‌ను గుర్తించే టెక్నాలజీని అభివద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బాయల్.. కేవలం నాలుగేళ్లలోనే దాన్ని సాధించడం విశేషం.
మనిషికి రాగల వేర్వేరు కేన్సర్లలో కనీసం సగంవాటిని బ్రెత్ బయాప్సీ ద్వారా గుర్తించవచ్చు. తద్వారా శస్త్రచికిత్సతో చేసే బయాప్సీ అవసరం ఉండదు. కేన్సర్ సోకినప్పుడు మన కణాల్లో కొన్ని నాశనమై కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు ఊపిరి ద్వారా బయటకు వస్తూంటాయి. ఈ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్‌ను గుర్తించేలా బ్రెత్ బయాప్సీని సిద్ధం చేశారు. ఎలాంటి లక్షణాలు కనబరచకపోయినా ఊపిరిత్తుల, కడుపులోని కేన్సర్‌ను ఇది సులువుగా గుర్తించగలదు. కొన్ని ఇతర వ్యాధుల నిర్ధారణకూ ఇది ఉపయోగపడుతుందని అంచనా. ఈ అద్భుత ఆవిష్కరణకు ఇంజనీరింగ్ నోబెల్ అవార్డుగా పరిగణించే మెక్‌రాబర్ట్ అవార్డు దక్కింది.