
ఉఫ్... అని ఊదితే రోగాన్ని చెప్పేస్తుంది!
సిడ్నీ: ఆవలిస్తే పేగులు లెక్కించడం కాదు.. ఒక్కసారి ఉఫ్ మని ఊదితే చాలు మీకున్న రోగాలను పట్టేసే లేజర్ పరికరం వచ్చేసింది! మనం వదిలే ఊపిరిలో ఏయే వాయువులున్నాయి.. అవి ఎంత గాఢతతో ఉన్నాయి.. అవి ఏ వ్యాధికి సంబంధించినవో చిటికెలో చెప్పేస్తుందట. అంతేనా... మన చుట్టూ ఉన్న వాతావరణంలో గ్లోబల్ వార్మింగ్‌కు కారణమయ్యే గ్రీన్‌హౌస్ వాయువులు ఏ కొద్ది మోతాదులో ఉన్నా పసిగడుతుంది. ఈ అద్భుతమైన పరికరాన్ని ఆస్ట్రేలియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ అడెలేడ్’కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. మామూలు లేజర్ల కంటే ఈ కొత్త తరహా లేజర్ 25 రెట్లు అధికంగా కాంతిని ఉద్గారం చేస్తుందని పరిశోధనలో పాలుపంచుకున్న హిండర్సన్-సపైర్ తెలిపారు. దీనివల్ల వాయువులను కచ్చితంగా గుర్తించవచ్చని వివరించారు. వైద్య రంగంలో వివిధ వ్యాధుల నిర్ధారణకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ఉదాహరణకు మధుమేహం ఉన్నవారి శ్వాసలో ఎసిటోన్ వాయువు ఉంటుంది. వారు ఊపిరి తీసుకొని వదిలినప్పుడు ఈ పరికరం ఆ వాయువును గుర్తిస్తుంది. దీన్నిబట్టి వారికి మధుమేహాన్ని నిర్ధారించవచ్చు. ఇదొక్కటే కాదు.. చాలా వ్యాధులకు సంబంధించిన వాయువులను కూడా ఈ లేజర్ పరికరం గుర్తిస్తుందట!