అలెగ్జాండర్ ది గ్రేట్.. జగజ్జేత.. ప్రపంచాన్ని జయించిన మహావీరుడు.. మరి అంతటి వీరాధివీరుడు ఎలా చనిపోయాడు.. ఏదో ఇన్‌ఫెక్షన్ సోకి అని కొందరు.. తాగుడు అలవాటు వల్ల అని ఇంకొందరు.. అబ్బే.. ఇదేం కాదు.. విషమిచ్చి చంపారని మరికొందరు.. ఎవరేం చెప్పినా.. మొత్తానికి అదో మిస్టరీ అయి కూర్చుంది..
2,300 ఏళ్లనాటి ఈ మిస్టరీని తాను ఛేదించానని చెబుతున్నారు న్యూజిలాండ్‌లోని ఒటాగో వర్సిటీకి చెందిన పరిశోధకురాలు కేథరీన్ హాల్. అంతేకాదు.. ఇప్పటివరకూ అందరూ చెబుతున్నట్లుగా క్రీ.పూ. 323 జూన్ 10న లేదా 11న అలెగ్జాండర్ చనిపోలేదట. అతడు చనిపోయినట్లు ప్రకటించిన తేదీకి ఆరు రోజుల అనంతరం మరణించాడట. కానీ.. అప్పటి వైద్యుల తప్పుడు నిర్ధారణ వల్ల బతికుండగానే.. అలెగ్జాండర్ చనిపోయినట్లు ప్రకటించారట. సంచలనం రేకెత్తిస్తున్న ఈ అధ్యయనం తాలూకు వివరాలు ‘ది ఏన్షియెంట్ హిస్టరీ బులెటిన్’లో ప్రచురితమయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపింపజేసే ఆ అధ్యయనం తాలూకు వివరాలేంటో చూసేద్దామా..
డాక్టర్ కేథరీన్ హాల్..
ఒటాగో వర్సిటీలోని డ్యూన్‌డిన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన సీనియర్ లెక్చరర్. ఆమె చెప్పినదాని ప్రకారం.. అలెగ్జాండర్‌కు గులియన్ బారే సిండ్రోమ్ వచ్చింది.. అప్పటికాలంలో కామన్‌గా ఉండే ఒకరకమైన బ్యాక్టీరియా వల్ల ఇది ఆయనకు సోకింది. గులియన్ బారే సిండ్రోమ్ అన్నది నరాలకు సంబంధించిన ఓ అరుదైన రుగ్మత. ప్రతి లక్ష మందిలో ఒకరికి వచ్చే అవకాశముంది. దీని వల్ల నాడీ వ్యవస్థపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది.. దాంతో అలెగ్జాండర్ ఒళ్లంతా పక్షవాతం వచ్చింది. బుర్ర పనిచేస్తుంది కానీ.. మనిషి మాత్రం చచ్చిన శవంలాగ అయిపోయాడు. దీంతో వైద్యులు అలెగ్జాండర్ చనిపోయినట్లు ప్రకటించారు. వాస్తవానికి అతడు బతికే ఉన్నాడు. చనిపోయాడని ప్రకటించిన తేదీ నుంచి ఆరు రోజుల తర్వాత అతను మరణించాడు. ‘అలెగ్జాండర్ మరణంపై వచ్చిన పాత వాదనలన్నీ ఒట్టి ట్రాష్. ఎందుకంటే.. అవి మొత్తం ఎపిసోడ్‌ను వివరించలేదు.
అప్పటికాలంలో వైద్యులు మనిషి బతికున్నాడా లేదా అన్నది నిర్ధారించేందుకు శ్వాస ఆడుతోందా లేదా అన్నదే చూసేవారు. పల్స్‌ను పరీక్షించేవారు కాదు.. గులియన్ బారే సిండ్రోమ్ వల్ల ఒళ్లంతా పక్షవాతం వచ్చింది. దీంతో ఆక్సిజన్ చాలా తక్కువ స్థాయిలో అవసరం పడేది. దీని వల్ల శ్వాస తీసుకున్నా.. తెలిసీ తెలియనట్లు ఉండేది. అదే అప్పటి తప్పుడు నిర్ధరణకు‘ కారణం’ అని కేథరీన్ తెలిపారు. అంతేకాదు.. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అతడి శరీరం కుళ్లకపోవడాన్ని ఆమె గుర్తు చేశారు. ‘దీనికి సంబంధించి చరిత్రలో సరైన వివరణ ఇప్పటికీ లేదు. ఆరు రోజుల వరకూ అతడి శరీరం తాజాగానే ఉంది. దీనికి కారణం అప్పటికీ అలెగ్జాండర్ బతికి ఉండటమే. కాకపోతే.. గ్రీకులు అతడిని దేవుడిగా భావించేవారు. దీంతో ఆ మహిమ వల్లే అలెగ్జాండర్ శరీరం తాజాగా ఉందని నమ్మారు’ అని ఆమె వివరించారు. తన పరిశోధన కొత్త చర్చకు తెరలేపుతుందని.. అవసరమైతే.. చరిత్ర పుస్తకాలను తిరగరాయాల్సి ఉంటుందని కేథరీన్ అంటున్నారు. ఏమోమరి.నిజానిజాలు ఆ అలగ్జాండర్‌కే ఎరుక.
– సాక్షి సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment