వాషింగ్టన్: రెగ్యులర్‌గా ట్వీట్స్ పోస్టు చేసే అలవాటు మీకుందా? ట్విట్టర్‌లో మిమ్మల్ని తగినంత మంది ఫాలో అవుతున్నారా? అయితే, మీ ప్రమేయం లేకుండానే.. ట్విట్టర్ మీ జీవిత చరిత్రను ఇట్టే చెప్పేయగలదు.. జాగ్రత్త! మీరు పోస్ట్ చేసే ట్వీట్లలో పేర్కొన్న ముఖ్యమైన సంఘటనల ఆధారంగా మీ జీవిత చరిత్రను పూసగుచ్చే కొత్త టెక్నిక్ అందుబాటులోకి వచ్చింది. పిట్స్‌బర్గ్‌లోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, ఇథకలోని కార్నెల్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు జివీ లీ, క్లైరె కార్డీ ఉమ్మడిగా రూపొందించిన అల్గోరిథమ్ టెక్నిక్ బ్రహ్మాండంగా పనిచేస్తోందని ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ పేర్కొంది.
వ్యక్తుల వివరాలు ఏమీ తెలియకుండానే.. కేవలం వారు పోస్ట్ చేసిన ట్వీట్లను జల్లెడపట్టి.. వారి జీవిత చరిత్రను చక్కగా రూపొందించవచ్చని తమ అధ్యయనంలో రుజువైందని లీ, కార్డీ స్పష్టం చేశారు. 2011-2013 మధ్యకాలంలో 21 నెలల కాలంలో 20 మంది సాధారణ వ్యక్తులు పోస్ట్ చేసిన ట్వీట్ల ఆధారంగా ముఖ్య సంఘటనలను రాసుకోమని లీ, కార్డీ వారికే పురమాయించారు. వికీపీడియా, ఇతరత్రా సేకరించిన సమాచారంతో 20 మంది ప్రముఖుల జీవిత చరిత్రలను రూపొందించారు. అదేమాదిరిగా, ట్వీట్ల ఆధారంగా అల్గోరిథమ్ టెక్నిక్ ద్వారా ఈ 40 మంది జీవిత చరిత్రలను లీ, కార్డీ తయారు చేశారు. ఈ రెండు రకాల జీవిత చరిత్రలను సరిపోల్చి చూసినప్పుడు.. వారి జీవితంలో దాదాపు అన్ని ముఖ్య సంఘటనలతో కూడిన జీవిత చరిత్రలను అల్గోరిథమ్ సమగ్రంగా రూపొందించినట్లు తేలింది. ట్విట్టర్‌లో అకౌంట్ ఉన్న స్నేహితుడు, పోటీదారు లేదా సినీ ప్రముఖుల్లో ఎవరి జీవిత చరిత్రనైనా ఈ టెక్నిక్ ద్వారా రూపొందించవచ్చని లీ, కార్డీ చెబుతున్నారు.