మంచుకొండ కాదు.. నయాగారా!
నయాగారా జలపాతం గడ్డకట్టుకుపోయింది. ఎప్పుడూ ప్రవహించే నీళ్లతో కళకళలాడుతుండే ఈ జలపాతాలు ఉన్నట్టుండి మంచు కొండల్లా మారిపోయాయి. దాంతో దీన్ని చూసేందుకు పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. ఈ జలపాతాల్లో అమెరికా వైపు ఉండే ప్రాంతమంతా బాగా చలి ఉండటంతో అక్కడ నీళ్లన్నవి కనపడకుండా మొత్తం మంచుకొండల్లా మారిపోయింది.
అమెరికా, కెనడా ప్రాంతాల్లో చాలావరకు విపరీతమైన చలి ఉంటోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలి కూడా బాగా చల్లగా ఉండటంతో చలి ఎముకలు కొరికే స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పర్యాటకులు కెమెరాలు పట్టుకుని గడ్డకట్టుకుపోయిన జలపాతాన్ని దృశ్యరూపంలో బంధించేందుకు పోటీలు పడుతున్నారు.