ట్రంప్‌ నిర్ణయంతో మేలే..! | No ban on Muslim sayes Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ నిర్ణయంతో మేలే..!

Published Tue, Jan 31 2017 12:27 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ట్రంప్‌ నిర్ణయంతో మేలే..! - Sakshi

ట్రంప్‌ నిర్ణయంతో మేలే..!

ఐసిస్, జిహాదీ గ్రూపుల ఎద్దేవా

  • అమెరికన్‌ ముస్లింలు మా వైపు మొగ్గేలా నిర్ణయం: ఉగ్రవాద సంస్థలు
  • ముస్లింలపై నిషేధం కాదు.. మీడియా వక్రీకరించింది: ట్రంప్‌
  • ట్రంప్‌ ఉత్తర్వుల్ని వ్యతిరేకించిన 16 రాష్ట్రాల అటార్నీలు

వాషింగ్టన్‌: ట్రంప్‌ నిర్ణయాన్ని ప్రపంచమంతా తప్పుపడుతుంటే ఐసిస్‌ సహా జిహాదీ గ్రూపులు మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. అమెరికన్‌ ముస్లింలు తమ వైపు మొగ్గేలా డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం దోహదపడుతుందని, ఏదేమైనా అమెరికా అధ్యక్షుడు తమకు మంచి చేశారంటూ సోషల్‌ మీడియాలో ఎద్దేవా చేస్తున్నాయి. ఈ మేరకు పలు పోస్టుల్ని వాషింగ్టన్‌ పోస్టు పత్రిక ఉటంకించింది. ఇస్లాంకు సంబంధించి ట్రంప్‌ మంచి నిర్ణయం తీసుకున్నారంటూ ఒక పోస్టులో... త్వరలో మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభించవచ్చంటూ మరికొన్ని పోస్టుల్లో జిహాదీ గ్రూపులు పేర్కొన్నాయి. ట్రంప్‌ నిర్ణయం విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ముస్లింలు, అమెరికన్‌ ముస్లింల్ని తీవ్ర ఒత్తిడికి గురిచేయడం వల్ల... వారు తమకు మద్దతు పలుకుతారంటూ ఐసిస్‌ పేర్కొంది. పాశ్చాత్య దేశాలు ఎప్పటికైనా ముస్లిం పౌరులకు వ్యతిరేకంగా మారతాయంటూ అల్‌కాయిదా నేత అన్వర్‌ అల్‌ అవ్లాకీ అప్పుడే చెప్పారంటూ మరికొన్ని పోస్టులు దర్శనమిచ్చాయి.

అమెరికన్ల భద్రతే ముఖ్యం: ట్రంప్‌
ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధంతో నిరసనల జ్వాలలు ఎగసిపడడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆత్మరక్షణలో పడ్డారు. తన చర్యల్ని సమర్థించుకునేందుకు తంటాలుపడుతున్నారు. అమెరికాలోకి ప్రవేశంపై నిషేధ ఉత్తర్వుల్ని మీడియా తప్పుగా వక్రీకరించిందని, అది ముస్లింలపై నిషేధంకాదంటూ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. ‘ఒక విషయం మాత్రం స్పష్టం. ఇది ముస్లింలపై నిషేధం కాదు. ఈ ఉత్తర్వులు మతానికి సంబంధించినవి కాదు. ఉగ్రవాదానికి సంబంధించినవి. అమెరికన్ల భద్రత, దేశానికి సేవ చేయడమే ఎప్పటికీ నా ప్రథమ కర్తవ్యం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో 40 ముస్లిం మెజారిటీ దేశాలు ఉండగా తాజా నిర్ణయ ప్రభావం వారిపై లేదని చెప్పారు. 90 రోజుల్లో వీసాల జారీ ప్రక్రియలో అధికారులు మార్పులు చేసి అన్ని దేశాల పౌరులకు వీసాలు జారీ చేస్తారన్నారు. ‘అమెరికా ఎప్పటికీ స్వేచ్ఛ, సాహసానికి గడ్డగానే కొనసాగుతుంది. ఈ దేశాన్ని మనం స్వేచ్ఛగా, భద్రంగా ఉంచాలి’ అని పేర్కొన్నారు.

అక్కడే రక్షణ ప్రాంతాలు నిర్మించండి
అంతర్యుద్ధంతో అల్లాడుతున్న సిరియా, యెమెన్‌ దేశాల్లోనే సేఫ్‌ జోన్లు (రక్షణ ప్రాంత్రాలు) నిర్మించాలన్న అమెరికా ప్రతిపాదనకు సౌదీ అరేబియా, యూఏఈ అంగీకారం తెలిపాయి. ఈ మేరకు అధ్యక్షుడు  ట్రంప్‌ సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దులజీజ్, అబుదాబి యువరాజు మహమ్మద్‌ బిన్‌ జాయేద్‌లతో  ఫోన్‌లో మాట్లాడరని వైట్‌హౌస్‌ ప్రతినిధులు వెల్లడించారు. సేఫ్‌ జోన్ల ద్వారా పాశ్చాత్య దేశాలకు శరణార్థుల రాకను అడ్డుకోవచ్చన్న ట్రంప్‌ ఆలోచనకు మద్దతు పలికారని చెప్పారు.  

ఈ నిర్ణయం అక్రమం: ఐక్యరాజ్యసమితి
ట్రంప్‌ నిర్ణయం అక్రమం, జాలిలేని నిర్ణయమంటూ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల చీఫ్‌ జయెద్‌ బిన్‌ అల్‌ హుస్సేన్‌ తప్పుపట్టారు. కేవలం జాతీయత ఆధారంగా వివక్ష చూపడాన్ని మానవ హక్కుల చట్టం ప్రకారం నిషేధించారని ట్వీటర్‌లో ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ తమ దేశం రావద్దంటూ దాదాపు పది లక్షల మంది బ్రిటన్‌వాసులు ఆన్‌లైన్‌ పిటిషన్‌పై సంతకాలు చేశారు. బ్రిటన్‌ పార్లమెంట్‌ వెబ్‌సైట్‌లో శనివారం పిటిషన్‌ పెట్టగానే లక్షల మంది స్పందించారు.

ట్రంప్‌కు స్టార్‌బక్స్‌ దీటైన జవాబు
ట్రంప్‌ నిర్ణయానికి స్టార్‌ బక్స్‌ చైర్మన్, సీఈవో హోవార్డ్‌ షూల్జ్‌ ఘాటుగా సమాధానమిచ్చారు. వచ్చే ఐదేళ్లలో 10 వేల మంది శరణార్థులకు ఉపాధి కల్పిస్తానంటూ కంపెనీ ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో ఉన్న స్టార్‌ బక్స్‌ కాఫీ స్టోర్లలో వారికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. మరోవైపు, ఈ నిషేధాన్ని కొట్టి వేయాలని కోరుతూ తాను అమెరికా సెనేట్‌లో బిల్లును ప్రవేశ పెడతానని డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన సెనేటర్‌ డ్యానీ ఫీన్‌స్టీన్‌ చెప్పారు.

ఉత్తర్వులపై పోరాడతాం: అటార్నీలు
వలసలపై ట్రంప్‌ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వుల్ని అమెరికాలోని 16 రాష్ట్రాల అటార్నీ జనరల్స్‌ వ్యతిరేకించారు. ఈ మేరకు పలువురు అటార్నీ జనరల్స్, డెమోక్రాట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని, పోరాటం చేస్తామని చెప్పారు. ‘13 కోట్ల మంది అమెరికన్లు, అమెరికాలో ఉంటున్న విదేశీయులకు చట్టబద్ధ ప్రతినిధులుగా ఉన్న మేము ట్రంప్‌ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, అమెరికా వ్యతిరేక నిర్ణయంగా పేర్కొంటున్నాం’ అని తెలిపారు. ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిలో ఇల్లినాయి, కాలిఫోర్నియా, కనెక్టికట్, కొలంబియా, హవాయి, అయోవా, మైనే, మేరీ ల్యాండ్, మసాచుసెట్స్, న్యూ మెక్సికో, న్యూయార్క్, ఓరెగాన్, పెన్సిల్వేనియా, వెర్మౌంట్, వర్జీనియా, వాషింగ్టన్‌ల అటార్నీ జనరల్స్‌ ఉన్నారు.

రికార్డు స్థాయిలో శరణార్థులు
2016లో రికార్డు స్థాయిలో 39వేల మంది ముస్లిం శరణార్థులు అమెరికాకు వచ్చారని తాజా నివేదికలో వెల్లడైంది. 2016 సెప్టెంబర్‌ వరకు 84,995 మంది శరణార్థులు అమెరికా వచ్చారంది. వీరిలో 46 శాతం మంది ముస్లింలు, 44 శాతం క్రైస్తవులు ఉన్నట్లు తెలిపింది. 2016 అక్టోబర్‌ 1 నుంచి 2017 జనవరి 24 వరకు 31,143 మంది శరణార్థులు వచ్చారని వెల్లడించింది. సిరియా సహా ఏడు ముస్లిం దేశాల నుంచి పౌరులు అమెరికా రాకుండా అడ్డుకునేలా ట్రంప్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నివేదిక బయటకు వచ్చింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement