ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ఇండియాలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇండియాలో ‘స్ట్రీట్ వ్యూ’ సర్వీసు ప్రారంభిద్దామనుకున్న గూగుల్ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచింది. భద్రతా కారణాలతో తిరస్కరిస్తున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ గంగారం అహిర్ వెల్లడించారు.
బహిరంగ ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో చూయించేందుకు అనుమతి తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి 2015, జూలైలో సమర్పించింది. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.ఈ విషయం గురించి వేలూరు ఎంపీ బాలసుబ్రమణియన్ రాతపూర్వకంగా పశ్న అడిగినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి ప్రత్యేక కారణం లేదంటూ సమాధానం దాటవేశారు. రక్షణశాఖ అధికారులు భద్రతకు ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని చెప్పినట్లు మంత్రి వివరించారు.
ఈ ‘స్ట్రీట్ వ్యూ’ సర్వీసును మొదటగా 2011లో బెంగుళూరులో ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాలను కెమెరాలో బంధింస్తుడటంతో స్థానిక అధికారులు అభ్యంతరంవ్యక్తం చేశారు. దీంతో అప్పుడు సర్వీసు నిలిచిపోయింది. మళ్లీ 31 చారిత్రాత్రక కట్టడాలను 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించేందుకు 2015లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాతో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఈ సర్వీసు గురించి చర్చలు జరుపుతోంది.
గూగుల్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ ప్రస్తుతం 82 దేశాల్లో ఉంది, ఈ సర్వీసు వల్ల పర్యాటకులకు ఎంతో మేలు కలుగుతుంది. మొట్టమొదటి సారి 2007లో కార్లు, బైక్‌లపై కెమెరాలను అమర్చి 360 డిగ్రీల కోణంలో చిత్రాలను సేకరించడం, సేకరించిన చిత్రాలను పనోరమిక్ త్రీడీ కోణంలో చూసేవిధంగా గూగుల్ అమెరికాలో ప్రవేశపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment