మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది? | North Korean Media Silence On Kim Jong Un Health Over Speculation | Sakshi
Sakshi News home page

అధికార మీడియా మౌనం.. అసలు కిమ్‌కు ఏమైంది?

Published Wed, Apr 22 2020 10:20 AM | Last Updated on Wed, Apr 22 2020 5:09 PM

North Korean Media Silence On Kim Jong Un Health Over Speculation - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న తరుణంలో తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ దేశ సుప్రీం లీడర్‌, సంచలనాలు, వివాదాలకు మారుపేరైన కిమ్‌ జోంగ్‌ ఉన్‌(36) తీసుకున్న నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందంటూ స్థానిక మీడియా పేర్కొంది. అంతేకాదు కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ప్రణాళికలు రచిస్తున్న వేళ కిమ్‌ మాత్రం క్షిపణి ప్రయోగాలు వీక్షిస్తున్న ఫొటోలు మీడియాకు విడుదల చేస్తూ తన రూటే సపరేటు అని మరోసారి నిరూపించుకున్నారు. అయితే ఏప్రిల్‌ 12 తర్వాత సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. అధికారిక కార్యక్రమాల్లో ఎక్కడా ఈ వివాదాస్పద నేత కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు గుప్పుమన్నాయి. వేడుకగా జరిగే తన తాత జయంతి ఉత్సవాలకు కూడా కిమ్‌ రాకపోవడంతో వదంతులకు బలం చేకూరింది. (కిమ్‌ ఆరోగ్యం విషమం.. సౌత్‌ కొరియా స్పందన)

ఈ క్రమంలో సీఎన్‌ఎన్‌ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కిమ్‌ ఆరోగ్యం విషమించిందంటూ కథనాలు వెలువరించాయి. ఈ నేపథ్యంలో దాయాది దేశం దక్షిణ కొరియాకు చెందిన డైలీ ఎన్‌కే అనే వెబ్‌సైట్‌ గుండె కండరాల నొప్పితో కిమ్‌ ఆస్పత్రిలో చేరారని సోమవారం వెల్లడించింది. విపరీతంగా పొగ తాగడం, స్థూలకాయం, అధిక పనిభారం వల్ల ఆగస్టులోనే కిమ్‌ అనారోగ్యానికి గురయ్యారని పేర్కొంది. అయితే తమ దేశానికి సంబంధించిన ప్రతీ విషయంలోనూ వేగంగా స్పందించే ఉత్తర కొరియా మీడియా సంస్థ కిమ్‌ ఆరోగ్యం గురించి ఎటువంటి కథనాలు ప్రచురించకపోవడం గమనార్హం. బుధవారం నాటి ముఖ్యాంశాల్లో క్రీడా పరికరాలు, మల్బరీ పండ్ల కోత, బంగ్లాదేశ్‌లో నార్త్‌ కొరియా సిద్ధాంతాల గురించి జరిగిన చర్చ తదితర అంశాల గురించి మాత్రమే ప్రస్తావించింది. 

అదేవిధంగా ఆ దేశ అధికారిక పత్రిక(అధికార వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా) రోడాంగ్‌ సిన్‌మన్‌ సైతం ఆర్థిక వ్యవస్థ, కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖంగా కథనాలు వెలువరించింది. దీంతో కిమ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్న దక్షిణ కొరియా, చైనా అధికారులకు నిరాశే ఎదురవుతోంది. కిమ్‌ ఆరోగ్యం విషయంలో స్థానిక మీడియా గోప్యం పాటిస్తుండటంతో అసలు కిమ్‌కు ఏమైందన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతీ విషయంలో దూకుడుగా ఉండే కిమ్‌ గురించి ఇంత చర్చ జరుగుతున్నా అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో విదేశీ మీడియా చెబుతున్నట్లు నిజంగానే కిమ్‌ బ్రెయిన్‌డెడ్‌కు గురయ్యారా అనే అనుమానాలకు బలం చేకూరుతోంది. (కిమ్‌ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా: ట్రంప్‌)

ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా నిఘా వర్గాలు సైతం ఈ వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. కిమ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం కిమ్‌ గురించి వస్తున్న వార్తలపై స్పందించారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. కాగా అణ్వాయుధ పరీక్షలు జరుపుతూ ప్రపంచాన్ని గడగడలాడించిన కిమ్‌తో ట్రంప్‌ 2018, 2019లో రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా జరిగిన భేటీలో కుదుర్చుకున్న ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేశారు. ఇక కిమ్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికాను సైతం బెంబేలెత్తించి, ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసిరిన ఈ యువ నేత త్వరగా కోలుకోవాలంటూ పలువురు నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement