దాన్ని చంపేశారు!
ఆర్లెండో: డిస్నీ రిసార్ట్‌లో రెండేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్న మొసలిని అమెరికాలోని అధికారులు అంతమొందించారు. చిన్నారి ప్రాణాలు తీసిన మొసలిని పట్టుకుని చంపేశామని ఫ్లోరిడా అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 15న విహారం కోసం తల్లిదండ్రులతో కలిసి డిస్నీ గ్రాండ్ ఫ్లోరిడియన్ రిసార్ట్ అండ్ స్పాకు వెళ్లిన లేన్ గ్రేవ్స్(2)ను మొసలి నీళ్లలోకి లాక్కుపోయింది. 16 గంటల తర్వాత చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. మొసలి తినేయడం వల్లే చిన్నారి మృతి చెందినట్టు గుర్తించారు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ ప్రాంతంలో ఆరు మొసళ్లను పట్టుకుని వేరే ప్రదేశానికి తరలించారు. మృతుడి దేహం నుంచి సేకరించిన డీఎన్ఏతో దాడి చేసిన మొసలిని గుర్తించి దాన్ని చంపేశారు. ఈ విషయాన్ని ఫ్లోరిడా వన్యప్రాణి సంరక్షణ అధికారులు ధ్రువీకరించారు. తమ కొడుకు మరణానికి కారణమైన మొసలిని చంపడంపై లేన్ గ్రేవ్స్ తల్లిదండ్రులు ఎటువంటి కామెంట్ చేయలేదు. మరోవైపు డిస్నీ రిసార్ట్‌లో ఎక్కడిక్కడ జాగ్రత్త సూచికలు పెట్టారు.