భర్త శవం పక్కన భార్యా పిల్లలు నవ్వుతూ...
న్యూయార్క్: భర్త అర్ధాంతరంగా కన్నుమూశారన్న బాధ ఎవా హాలండ్ ముఖంలో ఇసుమంతా కూడా కనిపించడం లేదు. ముద్దొచ్చే ఇద్దరు పిల్లల్లో ముఖాల్లో కూడా చిరునవ్వే కనిపిస్తోంది. కేవలం 26వ ఏటనే మరణించిన భర్త శవ పేటిక పక్కన పిల్లలతో నిలబడి ఫొటో దిగింది. పైగా దాన్ని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సోషల్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేసింది. భర్త పోయాడని ఏడ్వకపోయినా కనీసం ఒక్క కన్నీటి చుక్కైన కార్చని ఈమె లాంటి కాఠిన్య భార్యలు కూడా ఉంటారా ఈ లోకంలో? అని తొందరపడి ఈసడించుకుంటాం. తాత, తండ్రి శవాల పక్కన ఫొటోలు దిగి సోషల్ వెబ్‌సైట్లలో పోస్ట్ చేస్తున్న వేలం వెర్రిగాళ్ల సరసన దయచేసి ఆమెను చేర్చవద్దు.
11 ఏళ్ల అనుబంధానికి చరమగీతం పాడి అర్ధాంతరంగా ఈలోకం వీడి వెళ్లిపోయిన భర్త మైక్ సెటిల్స్ పట్ల ఆమెకు అపార ప్రేమ. పిల్లలంటే కూడా భర్త మైక్‌కు ఎనలేని ప్రేమ. గుండె లోతుల్లో నుంచి ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగి చిద్విలాసంగా నవ్వుతూ ఫొటోకు ఫోజ్ ఇచ్చిందంటే గుండె ఎంత దిటువు చేసుకుని ఉండాలి! తండ్రి పోయాడనే దు:ఖాన్ని పన్ల బిగువున దాచేసి తల్లి లాగే ఆ పిల్లలు కూడా నవ్వుతున్నారంటే వారికి ఆ తల్లి ఎవా హాలండ్ ఎంత నచ్చ చెప్పి ఉండాలి!
మరి ఎందుకు అలా హాలండ్ ఫొటో దిగిందంటే సోషల్ వెబ్‌సైట్లలో మనల్ని ఆకర్శించడానికే. తన భర్త మైక్ డ్రగ్స్‌కు అలవాటు పడి మరణించాడని, అలాగే ఎవరూ కూడా తన భర్తలాగా డ్రగ్స్‌కు అలవాటుపడి చేచేతులా జీవితాన్ని పాడు చేసుకోవద్దనే ఈ సమాజానికి సందేశం ఇవ్వడానికే ఆమె అలా చేశారట. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం.....
‘ఈ ఫొటో చూసిన వెంటనే మీకు ఇబ్బంది కలగవచ్చు. అసహ్యం కూడా వేయవచ్చు. ఇక్కడ ఫొటో పోస్ట్ చేయడం వెనకు నా ఉద్దేశం వేరు. మేము అమెరికాలోని ఒహాయో నగరంలో ఉంటున్నాం. మైక్, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అన్యోన్యంగా కాపురం చేశాం. ఎవాండేల్‌లోని జనరల్ ఎలక్ట్రిక్ ఏవియేషన్‌లో మైక్ పనిచేసేవాడు. పని ఒత్తిడంటూ నిద్ర మాత్రలు వేసుకునే వాడు. ఆ తర్వాతం మెల్లగా మైక్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. నచ్చచెప్పినా వినలేదు. చివరకు గతేడాది ‘డీ అడిక్షన్’ సెంటర్‌లో చేరాడు. కోలుకున్నాక తిరిగొచ్చాడు. ఫేస్‌బుక్‌లో తాను ఎలా డ్రగ్స్‌కు అలవాటు పడిందీ, ఎలా దాని నుంచి బయటపడిందీ చెప్పుకుంటూ వచ్చాడు. ఓసారి పన్ను నొప్పి తట్టుకోలేక మళ్లీ ఒక్క టాబ్లెట్ అంటూ డ్రగ్స్ మొదలు పెట్టాడు. పరిస్థితి విషమించింది.
సెప్టెంబర్ రెండవ తేదీన 26వ ఏట చనిపోయాడు. జీవితం గురించి మైక్ ఎన్ని కలలు కన్నాడో, పిల్లల భవిష్యత్ గురించి ఎంత ఆలోచించాడో భార్యగా నాకు తెలుసు. కన్న కలలు తీరకుండానే పిల్లలను కూడా వదిలిపెట్టి వెళ్లి పోయాడు. ఈ వయస్సులో తండ్రిని పూడ్చే పరిస్థితి ఏ పిల్లలకు కలగకూడదన్నది నా తాపత్రయం, నా ప్రయత్నం. కొద్దిగా డ్రగ్స్ తీసుకున్నా ఫర్వాలేదని ఎవరూ అనుకోకూడదు. డ్రగ్స్ తీసుకునే ముందు మైక్ కూడా ఏమీ ఆలోచించి ఉంటారో ఒక్కసారి ఊహించండి. డ్రగ్స్ మిమల్ని చంపేస్తుంది’ అంటూ ఎవా హాలండ్ తన లేఖను ముగించింది. ముందుగా ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన రెండు, మూడు రోజుల తర్వాత ఆమె ఈ వివరణ ఇచ్చింది. ఆమె లేఖను ఫేస్‌బుక్‌లో దాదాపు మూడు లక్షల మంది షేర్ చేసుకున్నారు. కామెంట్లూ వచ్చాయి. అందరూ సానుకూలంగానే స్పందించారు. అందులో ఆమె పట్ల కొంత మంది సానుభూతి వ్యాఖ్యలు చేయగా, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారు మానేస్తామంటూ ఒట్టేసుకోవడం విశేషం.