
ప్రతి పదినిమిషాలకో సైబర్ నేరం
బెంగళూరు: భారత్‌లో 2017 ప్రథమార్ధంలో సగటున ప్రతి పది నిమిషాల్లో ఒక సైబర్ నేరం నమోదైందని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టీ–ఇన్) తెలిపింది. 2016 మొత్తం ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం నేరాల సంఖ్య పెరిగిందనీ, గతేడాదిలో సగటున ప్రతి 12 నిమిషాలకు ఒక నేరం జరిగేదని తెలిపింది.ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య మొత్తం 27,482 సైబర్ కేసులు నమోదయ్యాయంది.
వీటిలో ఫిషింగ్, నెట్‌వర్క్ స్కానింగ్, సైట్లలోకి చొరబాటు, వైరస్, ర్యాన్సమ్‌వేర్ తదితర నేరాలున్నాయని సీఈఆర్‌టీ–ఇన్ పేర్కొంది. రోజురోజుకూ మరింత మంది భారతీయులు ఇంటర్నెట్‌ను వినియోగించడం ప్రారంభిస్తున్న ఈ రోజుల్లో...సైబర్ నేరాలను ముందే పసిగట్టి, నిరోధించగల యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం కీలకమని ఓ అధికారి పేర్కొన్నారు.