
100 మందిలో ఒకరు భారతీయులే!
అమెరికాలో నివసిస్తున్న ప్రస్తుత భారత సంతతి జనాభా ఒక శాతం దాటిపోయిందని అంచనా.
అమెరికాలో నివసిస్తున్న ప్రస్తుత భారత సంతతి జనాభా ఒక శాతం దాటిపోయిందని అంచనా. అంటే.. 32 లక్షల నుంచి 34 లక్షల మంది భారతీయులు వివిధ నివాస (వీసా–పౌరసత్వం) హోదాల్లో అమెరికాలో జీవిస్తున్నారు. అమెరికా మొత్తం జనాభా 32.5 కోట్ల మంది. అంటే ప్రతి వంద మంది అమెరికన్లలో ఒకరు భారత సంతతి వారే. జీవనోపాధి, మెరుగైన జీవనశైలి కోసం ఇతర దేశాలకు వలసపోయిన భారతీయుల్లో అత్యధికులు అమెరికాలోనే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.
ఇక అమెరికాలో స్థిరపడి, నివసిస్తున్న ఆసియావాసుల్లో జనాభా రీత్యా చూస్తే చైనా (1.25 శాతం), ఫిలిపీన్స్ (1.2 శాతం) దేశాలకు చెందినవారు మొదటి, రెండు స్థానాల్లో ఉండగా.. భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. ఉన్నది ఒక శాతమేగాని భారతీయ అమెరికన్లు (ఇండియన్ అమెరికన్స్) అత్యంత సంపన్నవర్గంగా గుర్తింపుపొందారు. సహజంగానే విద్యలో అందరికన్నా ముందున్నారు. ఇక.. నవంబర్ 8 ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్లోని ప్రతినిధుల సభకు ఐదుగురు, సెనేట్కు ఒకరు ఎన్నికయ్యారు. తద్వారా చట్టసభల్లో కూడా ఒక శాతం ప్రాతినిధ్యం సంపాదించారు.
(చదవండి : డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ వేటు!)
తెలుగోళ్లది రెండో స్థానం...
అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి జనాభాలో.. నివాస హక్కు ఉన్న తెలుగువారి సంఖ్య ఇటీవల బాగా పెరిగి 2.70 లక్షలకు చేరింది. అంటే.. దాదాపు 8.5 శాతం ఉంది. అమెరికాలోని భారత సంతతిలో సంఖ్య రీత్యా హిందీ మాతృభాషగా ఉన్న వర్గం మొదటి స్థానంలో ఉండగా.. ఇటీవలి వరకూ రెండో స్థానంలో ఉన్న గుజరాతీలను తెలుగువారు అధిగమించి ఆ స్థానాన్ని కైవసం చేసుకున్నారని అమెరికా యూనివర్సిటీ అధ్యాపకులు దేవేష్ కపూర్, సంజయ్ చక్రవర్తి ‘ది అదర్ ఒన్ పర్సెంట్ - ఇండియన్స్ ఇన్ అమెరికా’ అనే పుస్తకంలో వెల్లడించారు. అలాగే.. చట్టవ్యతిరేకంగా ప్రవేశించకపోయినా భారతీయులు కొందరు వీసా గడువు దాటి అమెరికాలో గడుపుతున్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. 2015లో టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాపై వచ్చిన భారతీయులు దాదాపు 15,000 మంది అనుమతించిన కాలాన్ని మించి అమెరికాలో బసచేశారని ఓ సర్వేలో తేలింది.
(చదవండి : ట్రంప్ నోట రోజుకో మాట)
సంపదలో, చదువులో ముందున్నాం...
అమెరికాలో స్థిరపడిన భారతీయుల్లో 95 వేల మంది పీహెచ్డీ (డాక్టరేట్) గ్రహీతలు ఉన్నారు. మిగిలినవారిలో 40 శాతం పట్టభద్రులు. అదే స్థానికులైన శ్వేత, నల్లజాతి అమెరికన్లలో 12 శాతం మందికి మాత్రమే ఈ డిగ్రీలున్నాయి. అలాగే, ఇక్కడి భారత సంతతివారి సగటు వార్షికాదాయం లక్ష డాలర్లు దాటిపోయింది. 2015-16 సంవత్సరంలో 1.33 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీల్లో చదవడానికి వెళ్లారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే 25 శాతం పెరిగారు. అమెరికాలో చదువుకునే ప్రతి ఆరుగురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయడు. గ్రాడ్యుయేట్ స్థాయిలో చూస్తే ప్రతి ఐదుగురు విదేశీ విద్యార్థుల్లో ముగ్గురు, పీజీ స్థాయిలో (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్)లో ప్రతి నలుగురు విదేశీ విద్యార్థుల్లో ముగ్గురు భారతీయులే. విదేశీ విద్యార్థుల సంఖ్య 7 శాతం పెరిగి, పది లక్షలకు చేరింది. వారి ద్వారా ఏటా అమెరికాకు 3,300 కోట్ల డాలర్ల ఆదాయం వస్తోంది.
(చదవండి : అమెరికాతో బంధం ఏనాటిదో..!)