ప్రియురాలిని చంపి కత్తి అమ్మకానికి పెట్టాడు
సాన్ డియాగో: తన ప్రియురాలిని కత్తితో కిరాతకంగా చంపి.. ఆ కత్తి గురించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడో ప్రబుద్ధుడు. 'ఒకరిని ముక్కలు ముక్కలుగా చేసేందుకు ఒక్కసారి మాత్రమే ఈ కత్తిని ఉపయోగించాను. ఇది ఇప్పటికీ కొత్తదే. దీనిని ఎవరైనా కొంటారా?' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఈ మేరకు తన గర్ల్‌ఫ్రెండ్‌ను అతి కిరాతకంగా హతమార్చిన 40 ఏళ్ల బ్రియాన్ బ్రిమేజర్‌కు అమెరికా కోర్టుకు 26 ఏళ్ల శిక్ష విధించింది.
కాలిఫోర్నియాకు చెందిన అతను 2011లో తన ప్రియురాలైన 42 ఏళ్ల యోన్నెలీ బాల్డెలీని పనామాలో అతికిరాతకంగా పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆమె దేహాన్ని ముక్కముక్కలు చేసి పనామాలోని ఓ దీవిలో విసిరేశాడు. పనామాలో రెండు నెలలపాటు వారిద్దరు కలిసి నివసించిన అనంతరం ఈ ఘటన జరిగింది. గతంలో సాన్‌డియాగోలో నావికుడిగా పనిచేసిన అతను హత్య చేసిన వెంటనే తన స్నేహితుడికి ఓ ఈమెయిల్ కూడా పంపాడు. 'పనామాలో తాను ఆనందభరితమైన జీవితాన్ని గడుపుతున్న'ట్టు ఆ ఈమెయిల్‌లో తెలిపాడు.
2013లో పనామా వాసులు ఓ మహిళ అస్తిపంజరాన్ని గుర్తించడంతో అతడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. తాజాగా కోర్టు విచారణలో అతడు నేరం అంగీకరించి.. యోన్నెలి కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పాడు. అయితే, అతడిని క్షమించవద్దని, కఠినంగా శిక్షించాలని బాధితురాలు యోన్నెలీ కుటుంబసభ్యులు కోరారు. దీంతో కోర్టు అతడికి 26 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.