మేయర్ ఇచిరో మట్సూరీ(ఫొటో: రాయిటర్స్)
టోక్యో: జపాన్ పట్టణం ఒసాకా మేయర్ ఇచిరో మట్సూరీపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల వివక్షపూరిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విరుచుకుపడుతున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జపాన్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మే 6 వరకు ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఒసాకా పట్టణంలో శుక్రవారం ఉదయం నాటికి దాదాపు 1500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ ఇచిరో.. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనుల నిమిత్తం మినహా బయటకు రావొద్దని కోరారు.(వీడియో షేర్ చేసిన ప్రధాని.. నెటిజన్ల ఫైర్!)
ఈ క్రమంలో సూపర్ మార్కెట్లలో సామాజిక ఎడబాటు పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని ఓ విలేకరి కోరగా.. ఇందుకు బదులిచ్చిన ఇచిరో.. ‘‘ఆడవాళ్లు షాపింగ్‌కు వస్తే ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. వాళ్ల స్థానంలో నువ్వు ఉన్నట్లయితే కావాల్సిన వస్తువులు తీసుకుని వెంటనే బయటకు వెళ్తావు. నేరుగా ఇంటికి చేరుకుంటావు. కానీ వాళ్లు అలా కాదు. ఆలస్యం చేస్తారు. కాబట్టి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ’’అని వ్యాఖ్యానించారు. అదే విధంగా భార్యాభర్తలు కలిసి షాపింగ్‌కు వెళ్లడం మానుకోవాలని సూచించారు. పుట్టిన నెలల ఆధారంగా సరి- బేసి విధానంలో సూపర్‌మార్కెట్‌కు వెళ్లాలని ప్రజలను కోరారు. ఈ క్రమంలో ఇచిరో వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. మహిళలను అగౌరవపరచడం జపాన్ సంస్కృతి కాదని.. ఇలాంటి వ్యక్తికి ప్రజాప్రతినిధిగా అర్హత లేదని కామెంట్లు చేస్తున్నారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..!)
Comments
Please login to add a commentAdd a comment