సింధూ నది నడిమధ్యలోని ఓ లంకగ్రామాన్ని స్వాధీనం చేసుకుని, పోలీసులు సహా 24 మందిని బందీలుగా పట్టుకున్న చోటు గ్యాంగ్ ఏరివేతకు ఆర్మీ రంగంలోకి దిగింది. 11 రోజులుగా మాఫియా గ్యాంగ్ కు, పోలీసులకు మధ్య జరుగుతోన్న కాల్పుల్లో ఇప్పటివరకు ఏడుగురు పోలీసులు చనిపోయారు. మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని సొంతరాష్ట్రం పంజాబ్ లోని రాజన్ పూర్ లంక గ్రామంలో ఈ కాల్పుల పర్వం చోటుచేసుకోవటం గమనార్హం.
11 రోజులుగా పోలీసులు చేస్తుప్రయత్నాలు కొలిక్కిరాకపోవటంతో మాఫియా గ్యాంగ్ పనిపట్టేందుకు సైన్యం బరిలోకి దిగాల్సివచ్చింది. చోటా గ్యాంగ్ ఏరివేతకు 1600 మంది సైనికులను రంగంలోకి దించినట్లు ఆర్మీ ప్రతినిధి జనరల్ ఆసిమ్ బజ్వా తెలిపారు. దాదాపు 10 కిలోమీటర్లు విస్తరించిన లంక గ్రామంలో తలదాచుకున్న గ్యాంగ్ స్టర్లు బందీలుగా పట్టుబడ్డ పోలీసులతోపాటు ప్రజలను అడ్డంపెట్టుకుని కాల్పులు జరుపుతున్నారని, అందుకే సైన్యం మరింత అప్రమత్తంగా ముందుకు కదులుతున్నదని బజ్వా వివరించారు.
పంజాబ్ ప్రావిన్స్ లో అనేక దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు చేసిన చోటా గ్యాంగ్ మాదకద్రవ్యాల సరఫరాలోనూ అందెవేసిన చెయ్యి. గులామ్ రసూల్ అలియాస్ చోటు.. చోటు గ్యాంగ్ కు నాయకుడు. కొద్దిమంది అవినీతి పోలీసుల అండదండలతో కొద్దికాలంలోనే నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకున్న చోటూ గ్యాంగ్ ఇప్పుడు సైన్యం ఆపరేషన్ తో కనుమరుగుకాక తప్పనిపరిస్థితి.