వ్యతిరేక కథనం రాశాడని పాక్ కర్కశం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ అక్కడి ప్రజలపైనే కాదు ప్రముఖులపైనా మరోసారి తన నియంతృత్వ పోకడను నిరూపించుకుంది. సైనిక నాయకత్వానికి, పౌరులకు మధ్య చీలికలు వచ్చాయని, అభిప్రాయబేధాలు వచ్చాయని బయటపెట్టిన అక్కడి టాప్ జర్నలిస్టును దేశం విడిచి వెళ్లొద్దని నిషేధం విధించింది. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం వల్లే పాక్ ప్రపంచంలో ఒంటరి అయ్యిందని, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ చెప్పినట్లు కూడా ఆ జర్నలిస్టు పేర్కొనడంతో ఆయనపై పరిమితులు విధించారు.
సిరిల్ ఆల్మేడియా అనే వ్యక్తి పాక్ లో ప్రముఖ జర్నలిస్టు. ఆయన డాన్ పత్రికకు రిపోర్టర్ గా, కాలమిస్టుగా పనిచేస్తున్నారు. తనపై పరిమితులు విధించిన విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. తనకు అసలు దేశం విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశమే లేదని, అయినా ఎందుకు నిషేధం విధించారో తనకు అర్ధం కావడం లేదని, కొంత గందరగోళాన్ని కలిగించిందని అన్నారు. భారత్, అఫ్ఘనిస్థాన్కు వ్యతిరేకంగా పాక్ ఏ విధంగా యుద్ధం నిర్వహిస్తుందో అనే విషయాన్ని డాన్ పత్రికలో తొలిపేజీలో పెద్ద కథనాన్ని ఆయన వెలువరించారు. దీంతో ఆయన పేరును పాక్ అధికారులు 'ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్'లో చేర్చారు. ఈ జాబితాలో ఉన్నవారంతా దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలి. లేదంటే నేరంగా పరిగణిస్తారు.