100మంది టీచర్లపై పాక్ వేటు
లాహోర్: వెంటనే తమ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాల్సిందిగా టర్కీకి చెందిన 100మంది టీచర్లను పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 20నాటికి కుటుంబ సభ్యులతో సహా ఖాళీ చేసి ఏ ఒక్కరు ఉండకుండా వెళ్లిపోవాలని చెప్పింది. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజులపర్యటనలో భాగంగా నేడు ఇస్లామాబాద్ వస్తుండగా పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతర్గత వ్యవహారాల మంత్రివర్గ సమాచారం ప్రకారం.. మూడు రోజుల్లోగా పాక్ ను విడిచి వెళ్లాలని టర్కీ టీచర్లకు చెప్పారంట.
మొత్తం 108మంది టీచర్లు ఇక్కడ విద్యను బోధిస్తున్నారని, అయితే, వారి వీసాల గడువు పూర్తవడం, వాటిని మరింత పొడిగించేందుకు నిరాకరించడంతో వారిని పంపిస్తున్నామని పాక్ అధికారులు చెప్పారు. వాస్తవానికి ఈ పాఠశాలను నడుపుతున్న వ్యక్తి అమెరికాలోని పాక్ సంతతికి చెందిన ఫెతుల్లా గులెన్ అనే ముస్లిం మతాచార్యుడు. అయితే, ఆయనను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ గతంలో తీవ్రంగా విమర్శించారు.
దీన్ని మనసులో పెట్టుకొని వారి వీసా గడువు పెంచనీయకుండా ఫెతుల్లా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి వారిని వెంటనే పంపించేందుకు ఒప్పించినట్లు తెలిసింది. పాక్ నిర్ణయంపై పాక్-టర్కీ స్కూళ్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఒత్తిళ్లకు తలొగ్గే పాక్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించాయి. ఎర్డోగన్ పర్యటన తర్వాత పాక్ నిర్ణయంలో మార్పు వస్తుందేమో చూడాలి.