ఇస్లామాబాద్ : పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పాకిస్తాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ వర్గాలు పాక్ విదేశాంగ శాఖను కోరినట్లు ఓ స్థానిక చానెల్ బుధవారం కథనాన్ని ప్రసారం చేసింది. మోదీని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు తెలిపింది. ఈ విషయమై పీటీఐ సీనియర్ నేతలు పాక్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జన్జువాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, చైనా అధినేత జిన్‌పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్, సార్క్ దేశాధినేతల్ని ఆహ్వానించాలని ఇమ్రాన్ యోచిస్తున్నట్లు ఛానెల్ తెలిపింది.
ఇమ్రాన్ ప్రమాణస్వీకార ఆహ్వానాన్ని మోదీ తిరస్కరిస్తే అంతర్జాతీయంగా పాక్ తలెత్తుకోలేదని విదేశాంగ అధికారులు ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లకు ఆహ్వానాలు పంపినట్లు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌధురి తెలిపారు. కాగా ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మంత్రుల నివాస సముదాయంలోని మరో ఇంట్లో దిగేందుకు ఇమ్రాన్ అంగీకరించారు. ఇప్పుడున్న ఇంట్లో ఇమ్రాన్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించలేమని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాక్ ప్రధాని నివాసాన్ని తాను ఉపయోగించబోనని గతంలో ఇమ్రాన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment