కీలక బిల్లును ఆమోదించిన పాకిస్థాన్
ఇస్లామాబాద్: హిందూ మహిళల హక్కుల కాపాడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కీలక బిల్లును ఆమోదించింది. హిందూ మైనారీలకు వివాహ నమోదు హక్కు కల్పించే బిల్లుకు పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ మంగళవారం ఆమోదం తెలిపింది. పది నెలల పాటు చర్చోపచర్చలు జరిపిన తర్వాత బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
19 కోట్లు జనాభా కలిగిన పాకిస్థాన్ లో దాదాపు 1.6 శాతం మంది హిందువులు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి హిందువుల వివాహ నమోదుకు చట్టబద్దమైన ప్రక్రియ లేదు. దీంతో హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అపహరణలు, బలవంతపు మతమార్పిడిలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని హక్కుల కార్యకర్తలు ఆందోళనలు వ్యక్తం చేశారు. వివాహ నమోదు హక్కు లేకపోవడంతో హిందూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. చట్టబద్దంగా వివాహం నమోదు చేసుకునే హక్కు లేకపోవడంతో హిందూ మహిళలకు కోర్టుల్లో న్యాయం జరగడం లేదని అంటున్నారు.
ప్రభుత్వం తాజాగా ఆమోదించిన వివాహ నమోదు చట్టంతో హిందూ మహిళలకు గొప్ప మేలు జరుగుతుందని మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు జోహ్రా యూసఫ్ అన్నారు. ఈ బిల్లు ప్రకారం హిందువులు పెళ్లి చేసుకోవడానికి కనీస వయస్సు 18గా నిర్ధారించారు. ఇతర మతాల్లో పురుషులు 18, మహిళలకు 16 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునేందుకు అర్హులవుతారు.