
నెత్తురోడిన లాహోర్
పాకిస్తాన్ వాణిజ్య రాజధాని లాహోర్ రక్తపు మడుగైంది. ఆదివారం సాయంత్రం చిన్నపిల్లల పార్కులో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడితో బీభత్సం సృష్టించారు..
- పార్కులో ఆత్మాహుతి దాడి
- 69 మంది దుర్మరణం
- ఈస్టర్ పండుగపూట విషాదం
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- ఘటనను ఖండించిన ప్రధాని మోదీ
లాహోర్: పాకిస్తాన్ వాణిజ్య రాజధాని లాహోర్ రక్తపు మడుగైంది. ఆదివారం సాయంత్రం చిన్నపిల్లల పార్కులో ఉగ్రవాదులు ఆత్మాహుతి బాంబు దాడితో బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో 69 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లాహోర్ డీఐజీ హైదర్ అష్రఫ్ తెలిపారు.
ఈ హఠాత్పరిణామంతో పిల్లల పార్కు రక్తపు మడుగులా మారింది. మహిళలు, చిన్నారుల మృతదేహాలతో పార్కులో పరిస్థితి భీతావహంగా మారింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సొంత ప్రాంతం, అత్యంత రద్దీగా ఉండే లాహోర్ టౌన్ ప్రాంతంలోని గుల్షన్-ఎ-ఇక్బాల్ పార్క్ ప్రధాన గేటు వద్ద ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో అందరూ పార్కు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని.. అందువల్లే దీని తీవ్రత ఎక్కువగా ఉందని ప్రాథమిక విచారణలో తేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. భద్రతా దళాలు పార్కును తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
ఈ ఘటనతో లాహోర్‌లోని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఘటన జరిగిన సమయంలో పార్కు వద్ద సరైన భద్రత లేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 5-6 కిలోల పేలుడు పదార్థాలను వినియోగించటం వల్ల భారీ శబ్దం వచ్చిందన్నారు. మృతుల్లో.. ఈస్టర్ సెలవు సందర్భంగా కాసేపు సరదాగా గడపుదామని పార్కుకు వచ్చిన క్రిస్టియన్ కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయని.. అంతమాత్రాన క్రిస్టియన్‌లే లక్ష్యం దాడి జరిగిందని చెప్పలేమని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో పంజాబ్ ప్రావిన్స్‌లో మూడురోజుల సంతాప దినాలు ప్రకటించారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, తెహ్రిక్-ఏ-ఇన్సాప్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ఈ ఘటనను ఖండించారు. పాకిస్తాన్ క్రిస్టియన్ నాయకులు కూడా ఈ ఆత్మాహుతి దాడిని తీవ్రంగా ఖండించారు. ‘పిల్లలు ఆడుకుంటుండటంతో.. వారిని చూస్తూ కూర్చున్నాను. ఇంతలో భారీ శబ్దం రావటంతో నేను నేలపై పడిపోయాను. తలకు దెబ్బతగలటంతో స్పృహ కోల్పోయాను. కాసేపటికి తేరుకుని చూస్తే.. అందరూ పరుగులు పెడుతున్నారు. పిల్లల కోసం వెతికాను. దేవుడి దయవల్ల ఓ చోట వారు స్వల్ప గాయాలతో కనిపించారు’ అని ఓ బాధితుడు బోరున విలపించింది.
ముక్త కంఠంతో ఖండించిన భారత్
లాహోర్ ఘటనపై తొలి స్పందన భారత ప్రధాని నరేంద్ర మోదీదే. ఈ ఘటనను ఖండించిన మోదీ.. బాధితుల కుటుంబాలను సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాక్‌లో ఆత్మాహుతి ఘటనను తీవ్రంగా ఖండించారు. అమాయకులు ప్రాణాలు కోల్పోవటం పట్ల ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ, క్రికెట్, బాలీవుడ్ ప్రముఖులు కూడా లాహోర్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా నిలుస్తున్నట్లు ట్వీట్లు చేశారు.