లండన్: దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్‌ల మాజీ గూఢచారులు లండన్‌లో ఒకే వేదికను పంచుకుని కశ్మీర్ అంశంపై మాట్లాడారు. ‘నిఘా సంస్థలు మంచి చేయగలవా?’ అన్న శీర్షికన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) మాజీ అధిపతి అమర్‌జిత్ సింగ్ దులాత్, పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మాజీ చీఫ్ ఎహ్‌సాన్ హక్ పాల్గొన్నారు.
దులాత్ మాట్లాడుతూ ‘కశ్మీరీల మనసుల నుంచి పాక్ ఎప్పుడో చెరిగిపోయింది. పాక్‌తో ఒనగూరే లాభం ఏదీ ఉండదని వారు గ్రహించారు. ఆ దేశంపై కశ్మీరీలు ఆశలేం పెట్టుకోలేదు. గత 15 నెల ల క్రితం వరకు పాక్‌గానీ, పాకిస్తాన్‌లో గానీ కశ్మీర్‌పై మాట్లాడింది లేదు. అయితే గత 15 నెలలుగా కశ్మీర్‌లో భారత్ సృష్టించిన గందరగోళం, ప్రభుత్వ విధానాల వల్లే మళ్లీ పాక్ కశ్మీర్ ను తెరపైకి తెస్తోంది’ అని అన్నారు. కశ్మీర్‌లో హింసకు ప్రతిహింస సమాధానం కాదన్నారు.
భారత్ కశ్మీరీలతో మాట్లాడకుండా ఇప్పటికీ తప్పు చేస్తోందనీ, సమస్య పరిష్కారానికి వేర్పాటువాదులతోనూ చర్చించాలన్నారు. బీజేపీ– పీడీపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన తప్పుబట్టారు. బీజేపీకి ప్రభుత్వంలో చోటు కల్పించిన పీడీపీని ప్రజలు ఇకపై ఎప్పటికీ క్షమించరన్నారు. ఎహ్‌సాన్ మాట్లాడుతూ కశ్మీర్‌లో గతేడాది బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ అనంతరం అక్కడి ప్రజల్లో తిరుగుబాటు పెరిగిందని అన్నారు. కశ్మీర్ వివాదాన్ని అలాగే వదిలేయకూడదనీ, అది అపరిష్కృతంగా ఉంటే సమస్య అంతకంతకూ పెరుగుతూ పోతుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు కశ్మీర్ అంశంపై చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని రెండు దేశాల గూఢచారులు ఆకాక్షించారు. దులాత్ గతంలో కశ్మీర్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment