ఫ్లాట్‌లో నివాసం.. కార్ల వేలం! | Pakistan Prime Minister Imran Khan Savings measures | Sakshi
Sakshi News home page

ఫ్లాట్‌లో నివాసం.. కార్ల వేలం!

Published Sun, Sep 2 2018 4:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:41 AM

Pakistan Prime Minister Imran Khan Savings measures - Sakshi

పాక్‌ ప్రధాని అధికారిక భవంతి

పైసా పైసా పొదుపు, అదే భవితకు మలుపు అంటున్నారు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌. ఆయన తీసుకుంటున్న పొదుపు చర్యలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి.  ప్రభుత్వంలో కొందరు ఇదెక్కడి పొదుపంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు దుబారాకు కళ్లెం పడాల్సిందేనని ఇమ్రాన్‌కు మద్దతు పలుకుతున్నారు. అధికారిక నివాసం కాదని అపార్ట్‌మెంట్‌లోకి   ఇమ్రాన్‌ పొదుపు చర్యల్ని మొదట తనతోనే మొదలు పెట్టారు.

134 ఎకరాల్లో విస్తరించిన రాజప్రాసాదం, 524 మంది సిబ్బంది ఉన్న ప్రధాని అధికారిక నివాసాన్ని కాదని 3 బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. కేవలం ఇద్దరు సేవకుల్ని మాత్రమే పనిలో ఉంచారు. ప్రధాని నివాసాన్ని యూనివర్సిటీగా మారుస్తానని ప్రకటించారు. ఉన్నతాధికారులు విమానాల్లో ఫస్టక్లాస్‌ ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఫస్ట్‌క్లాస్‌ బదులుగా ఇక బిజినెస్‌ క్లాసులోనే ప్రయాణించాల్సి ఉంటుంది.

మూడోసారి ప్ర«ధానిగా ఉన్న సమయంలో నవాజ్‌ షరీఫ్‌ 64 సార్లు విదేశీ ప్రయాణాలు చేశారు.  వెళ్లినప్పుడల్లా 631 మంది సిబ్బంది ఆయన వెంట ఉండేవారు. ఇందుకోసం రూ. 65 కోట్లు ఖర్చు చేశారు. అందువల్ల అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఇమ్రాన్‌ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి తప్ప మరెవరూ ఇతర దేశాలకు వెళ్లాల్సిన పని లేదని తేల్చేశారు. ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాల సమయంలో గత ప్రభుత్వాలు రకరకాల నోరూరించే వంటకాలతో లంచ్‌ ఏర్పాటు చేసేవి. ఇమ్రాన్‌ వాటన్నింటినీ తగ్గించేశారు. ఇప్పుడు సమావేశాల సమయంలో కనీసం బిస్కెట్లు కూడా ఇవ్వడం లేదని ఒక అధికారి వాపోయారు.

ప్రధాని లగ్జరీ కార్ల వేలం
ప్రధాని నివాసంలో అంతగా వినియోగంలో లేని 33 లగ్జరీ కార్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రధాని నివాసంలో సెప్టెంబర్‌ 17న ఈ వేలం జరుగుతుంది. ఎనిమిది బీఎండబ్ల్యూ కార్లు,  నాలుగు బెంజ్‌ కార్లు, 16 టయోటా కార్లతో పాటుగా నాలుగు బుల్లెట్‌ ప్రూప్‌ వాహనాలు, ఒక హోండా సివిక్‌ కారు, మూడు సుజుకి వాహనాలతో పాటుగా 1994 మోడల్‌కు చెందిన హినో బస్సును కూడా వేలం వేస్తారు.

హెలికాప్టర్‌ ప్రయాణం వివాదాస్పదం
ఇమ్రాన్‌ తన నివాసం నుంచి సెక్రటేరియెట్‌కి ప్రతీరోజూ హెలికాప్టర్‌లో వెళ్లి రావడం వివాదాన్ని రేపింది. అందరికీ సుద్దులు చెబుతున్న ఇమ్రాన్‌ హెలికాప్టర్‌లో వెళ్లడమేంటని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. హెలికాప్టర్‌లో వెళ్లితే కి.మీ.కు రూ. 50–55 రూపాయలకు మించి అవదని పాక్‌ సమాచార మంత్రి ఫవాద్‌ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఇమ్రాన్‌ ప్రయాణిస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ ఖర్చు కి.మీ.కు దాదాపు రూ.1600 అవుతుందని కొందరు తేల్చారు. దీంతో ప్రభుత్వం మాట మార్చి సామాన్య జనాలకు ఇబ్బందులు కలగకుండా, కాన్వాయ్‌ ఖర్చు లేకుండా చూసేందుకే ఇమ్రాన్‌ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారని సమర్థించుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement